దూషించిన టీడీపీ మహిళా నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ఎస్‌ఐ అనూరా«ద (ఫైల్)
దళితులపై తమకు ఉన్న చిన్నచూపును టీడీపీ నేతలు పదేపదే బయటపెడుతున్నారు. నలుగురిలోనూ వారిని దూషిస్తూ, హేళనగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారు. దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని ఇటీవల అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దళితుల వల్లే ఈ దరిద్రం అంటూ దళిత మహిళా ఎస్‌ఐని మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి దూషించారు. ఇలా దళితులను కులం పేరుతో దూషించడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది.
సాక్షి, గుంటూరు : ‘దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడు.. దళితులు దరిద్రులు..’ ఇవీ టీడీపీ శ్రేణులకు దళితులపై ఉన్న అభిప్రాయాలు ఇవి. అధికారులంటే వారికి చులకన.. దళితులంటే చిన్న చూపు. ఆధునిక సమాజంలో బతుకుతున్నామన్న కనీస జ్ఞానాన్ని కూడా టీడీపీ నాయకులు విస్మరిస్తున్నారు. నేటికీ కులం పేరుతో ఎస్సీ, ఎస్టీలను దూషిస్తుండటమే కాకుండా వారిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన హోదాలో ఉన్నామన్న ఇంగితాన్ని మరిచి అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ బుధవారం చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై దౌర్జన్యానికి పాల్పడి, యూజ్‌లెస్ ఫెలో అని దూషించారు.
బందోబస్తు విధులు నిర్వహిస్తున్న గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కోటయ్యపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విక్రాంత్ పాటిల్, ఎస్‌ఐ కోటయ్యతో పాటు పలువురు పోలీసులను దూషించారు. ‘ఎవర్రా మీకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై ఎస్‌ఐ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పట్టణ పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.
దళితులంటే దరిద్రులా..
టీడీపీ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా ఎస్‌ఐ అనురాధను కులం పేరుతో దూషించారు. ‘దళితులు దరిద్రులు.. మీ వల్లే మాకు ఈ పరిస్థితి పట్టింది’ అని కించపరిచారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఎస్‌ఐ అనురాధను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించడంపై మహిళా, దళిత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించి ఘోరంగా అవమానించిన ఘటన చోటు చేసుకున్న వారం రోజులకే మరో దళిత మహిళా అధికారిపై టీడీపీ నాయకులు అగ్రకుల అహంకారం చూపించారు. ఎస్‌ఐ అనురాధను కులం పేరుతో దూషించిన ఘటనలో టీడీపీ మహిళా నాయకురాళ్లు నన్నపనేని రాజకుమారి, సత్యవాణిపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదివారికి కొత్తేమీ కాదు..
దళితులను కులం పేరుతో దూషించడం, అధికారులను చులకనగా చూడటం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అనేక మంది అధికారులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం పై విజయవాడ ఎంపీ కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంకన్న దౌర్జన్యానికి పాల్పడ్డారు. 2017లో గుంటూరు జిల్లా ముట్లూరులో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు గ్రామంలోకి వెళ్లగా అక్కడ టీడీపీలోని ఓ వర్గం వారు అతన్ని వేడుకల్లో పొల్గొనకుండా అడ్డగించి అవమానపరిచింది.
చేసేదేమీ లేక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన వెనుతిరిగి వచ్చారు. అప్పట్లో దళిత సంఘాలు అగ్రకులాల అహంకారాన్ని తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 2019 జనవరి ఒకటిన అదే గ్రామంలో దళితులపై అగ్రకులాలకు చెందినవారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించమే కాకుండా ప్రశ్నించారనే కారణంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలు కేంద్ర ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో కమిషన్ సభ్యులు రాములు స్వయంగా గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపారు. వాస్తవాలను తెలుసుకున్న అనంతరం నిందితులను అరెస్టు చేయకపోవడంపై అప్పటి పోలీస్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment