పారామెడిక్స్ శిక్షణకు అంగీకారం
► ఆర్థికశాఖ కొర్రీతో అటకెక్కించే యత్నం
► గ్రామీణ వైద్యుల నిరసనతో దిగొచ్చిన ప్రభుత్వం
తెనాలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన బృహత్తర పథకాన్ని కొనసాగించేందుకు ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకు పార్టీ మేనిఫెస్టోలో చేర్చి, రాష్ట్ర విభజన తర్వాత హామీనిచ్చినా, తాత్సారం చేస్తూ వచ్చిన పథకాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నించింది. అలవిమానిన బడ్జెట్‌ను చూపుతూ ఆర్థిక శాఖ కొర్రీ వేయటంతో అమలుకు సాధ్యం కాదనే భావనను తీసుకొచ్చింది. దీనిపై గ్రామీణ వైద్యులు మండిపడటం, పత్రికా కథనాలు రావటంతో ఎట్టకేలకు దిగివచ్చింది.
కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శాస్త్రీయ శిక్షణనిచ్చి సామాజిక వైద్య సహాయకులుగా (కమ్యూనిటీ పారామెడిక్స్)గా తీర్చిదిద్దాలని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. 2008లో ఈ పథకానికి రూపకల్పన చేశారు. పీఎంపీ, ఆర్‌ఎంపీలకు శిక్షణనిచ్చి అర్హత పరీక్షలతో వారికి ‘కమ్యూనిటీ పేరామెడిక్స్’ (సామాజిక వైద్య సహాయకులు)గుర్తింపు నివ్వాలని సంకల్పించారు. వైద్య విధాన పరిషత్, హెచ్‌ఎంఆర్‌ఐతో కలిసి ఆంధ్రప్రదేశ్ పేరా మెడికల్ బోర్డు ద్వారా 2009-10లో తొలి దశ శిక్షణ ఆరంభించారు. డాక్టర్ వీ బ్రహ్మారెడ్డి తెలుగులో పాఠ్య పుస్తకాలు తెచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన కృత్రిమ దేహాలతో శరీర నిర్మాణ పాఠాలు, సీడీలు, ప్రొజెక్టర్ ఉపయోగించి శిక్షణనిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు 23 వేల మంది వరకు ఉండగా, వీరిలో 13 వేల మంది శిక్షణ పొందిన వారే.
శిక్షణ పొందిన వారికి అర్హత పరీక్ష, మిగిలిన వారికి శిక్షణ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. గెలిన తరువాత కూడా హామీనిచ్చారు. తాజాగా ఇందుకు రూ.50 కోట్లు వ్యయం కాగలదన్న భావనతో ఆర్థికశాఖ కొర్రీ వేసింది. దీనితో ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేయలేదు.
గ్రామీణ వైద్యుల మండిపాటు
విషయం తెలిసిన గ్రామీణ వైద్యులు మండిపడ్డారు. కేవలం రూ.5 కోట్ల వ్యయంతో పూర్తి చేసే కార్యాచర ణ ప్రణాళిక ఇస్తామంటూ సంఘ నేతలు ప్రకటించారు. దీనితో ప్రభుత్వం దిగొచ్చింది. అసోసియేషన్ నేతలు టీబీ రాజా సిద్ధార్థ, అచ్చిరెడ్డి, వీబీటీ రాజు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల గణపతి రావు, గంటా నాంచారయ్య, నాదెండ్ల కిషోర్‌బాబు, వివిధ జిల్లాల నేతలను హైదరాబాద్ పిలిపించి బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ పీ జనార్దన, శిక్షకుడు డాక్టర్ వీ బ్రహ్మారెడ్డి సమావేశమయ్యారు. అసంపూర్తి శిక్షణ పొందిన వారు, మిగిలిన వారు, కొత్తగా నమోదయ్యే వారికి శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. విధివిధానాల రూపకల్పనకు అధికారులతో సమావేశమై, మరోసారి అసోసియేషన్‌తో మాట్లాడాక, మేలో ప్రకటించి, అదే నెలలో శిక్షణ ఆరంభిస్తారని రాజా సిద్ధార్థ తెలియజేశారు. కొత్త సభ్యు లు సంబంధిత అసోసియేషన్‌లో పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు.