Paramedics
-
ఆపేశారా.. అడ్డుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయి.. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వారి మాతృ సంస్థలకు పంపేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు 12 మందిని సాగనంపేందుకు రంగం సిద్ధం చేశారు. ఏడుగురికి రిలీవ్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. మిగతా అయిదుగురిని సైతం నేడో, రేపో పంపించనున్నట్లు సంకేతాలు వెలువడినప్పటికీ వారిని పంపించలేదు. దాదాపు నెల రోజులైనా వారినింకా కదల్చలేదు. వారి స్థానాల్లో వారు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏడుగురిని పంపించడానికి అంతకుముందు సైతం అధికారులు తాత్సారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో.. డిప్యుటేషన్ గడువు ముగిసిపోయినప్పటికీ కొ నసాగుతున్న వారిని మాతృసంస్థకు సరెండర్ చేస్తూ జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. మరో అయిదుగురిని ఇంకా ఎందుకు పంపించలేదన్నది జీహెచ్ఎంసీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అవినీతి ప్రక్షాళన కానుందని భావించినా.. అవినీతిలో మునిగిన ఆరోగ్య, పారిశుద్ధ్య విభాగం ప్రక్షాళన కానుందని భావించినప్పటికీ బ్రేక్ పడింది. అత్యంత ఉన్నతస్థాయిలోని, రాజకీయ పైరవీలతోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు భావిస్తున్నారు. తగిన అండదండలుంటే జీహెచ్ఎంసీలో ఎంత అవినీతి చేసిన వారినైనా కొనసాగించడం, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా చర్యలు ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ధ్య, ఎంటమాలజీ విభాగాల్లో కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరణించిన, పనిచేయలేని వారి స్థానంలో కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగాలకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. చేతులు తడపని వారిని సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని జీహెచ్ఎంసీలోని యూనియన్ నాయకుడు అల్వాల్ శివకుమార్ పేర్కొన్నారు. (చదవండి: లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు) -
శ్మశానానికి తీసుకెళ్లగానే శ్వాస పీల్చింది!
వాషింగ్టన్ : అమెరికాలోని డెట్రాయిట్లో ఓ వింత ఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ.. శ్మశానవాటికలో శ్వాస పీలుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళ మరణించినట్లు పారామెడిక్స్ తేల్చడంతో.. ఆమెను డెట్రాయిట్‌లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అసలు విషయానికి వస్తే... గత ఆదివారం గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి ఒక ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మహిళ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా వారు ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు. అయితే జేమ్స్ కోల్ శ్మశానవాటికకు మహిళను తీసుకువెళ్లిన తర్వాత.. అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) -
పారామెడిక్స్ శిక్షణకు అంగీకారం
► ఆర్థికశాఖ కొర్రీతో అటకెక్కించే యత్నం ► గ్రామీణ వైద్యుల నిరసనతో దిగొచ్చిన ప్రభుత్వం తెనాలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన బృహత్తర పథకాన్ని కొనసాగించేందుకు ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకు పార్టీ మేనిఫెస్టోలో చేర్చి, రాష్ట్ర విభజన తర్వాత హామీనిచ్చినా, తాత్సారం చేస్తూ వచ్చిన పథకాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నించింది. అలవిమానిన బడ్జెట్‌ను చూపుతూ ఆర్థిక శాఖ కొర్రీ వేయటంతో అమలుకు సాధ్యం కాదనే భావనను తీసుకొచ్చింది. దీనిపై గ్రామీణ వైద్యులు మండిపడటం, పత్రికా కథనాలు రావటంతో ఎట్టకేలకు దిగివచ్చింది. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలకు శాస్త్రీయ శిక్షణనిచ్చి సామాజిక వైద్య సహాయకులుగా (కమ్యూనిటీ పారామెడిక్స్)గా తీర్చిదిద్దాలని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. 2008లో ఈ పథకానికి రూపకల్పన చేశారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణనిచ్చి అర్హత పరీక్షలతో వారికి ‘కమ్యూనిటీ పేరామెడిక్స్’ (సామాజిక వైద్య సహాయకులు)గుర్తింపు నివ్వాలని సంకల్పించారు. వైద్య విధాన పరిషత్, హెచ్‌ఎంఆర్‌ఐతో కలిసి ఆంధ్రప్రదేశ్ పేరా మెడికల్ బోర్డు ద్వారా 2009-10లో తొలి దశ శిక్షణ ఆరంభించారు. డాక్టర్ వీ బ్రహ్మారెడ్డి తెలుగులో పాఠ్య పుస్తకాలు తెచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన కృత్రిమ దేహాలతో శరీర నిర్మాణ పాఠాలు, సీడీలు, ప్రొజెక్టర్ ఉపయోగించి శిక్షణనిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు 23 వేల మంది వరకు ఉండగా, వీరిలో 13 వేల మంది శిక్షణ పొందిన వారే. శిక్షణ పొందిన వారికి అర్హత పరీక్ష, మిగిలిన వారికి శిక్షణ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. గెలిన తరువాత కూడా హామీనిచ్చారు. తాజాగా ఇందుకు రూ.50 కోట్లు వ్యయం కాగలదన్న భావనతో ఆర్థికశాఖ కొర్రీ వేసింది. దీనితో ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేయలేదు. గ్రామీణ వైద్యుల మండిపాటు విషయం తెలిసిన గ్రామీణ వైద్యులు మండిపడ్డారు. కేవలం రూ.5 కోట్ల వ్యయంతో పూర్తి చేసే కార్యాచర ణ ప్రణాళిక ఇస్తామంటూ సంఘ నేతలు ప్రకటించారు. దీనితో ప్రభుత్వం దిగొచ్చింది. అసోసియేషన్ నేతలు టీబీ రాజా సిద్ధార్థ, అచ్చిరెడ్డి, వీబీటీ రాజు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల గణపతి రావు, గంటా నాంచారయ్య, నాదెండ్ల కిషోర్‌బాబు, వివిధ జిల్లాల నేతలను హైదరాబాద్ పిలిపించి బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ పీ జనార్దన, శిక్షకుడు డాక్టర్ వీ బ్రహ్మారెడ్డి సమావేశమయ్యారు. అసంపూర్తి శిక్షణ పొందిన వారు, మిగిలిన వారు, కొత్తగా నమోదయ్యే వారికి శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. విధివిధానాల రూపకల్పనకు అధికారులతో సమావేశమై, మరోసారి అసోసియేషన్‌తో మాట్లాడాక, మేలో ప్రకటించి, అదే నెలలో శిక్షణ ఆరంభిస్తారని రాజా సిద్ధార్థ తెలియజేశారు. కొత్త సభ్యు లు సంబంధిత అసోసియేషన్‌లో పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు.