వీసీ నుంచి ఉత్తర్వులు అందుకుంటున్న ఆచార్య జి. గులాంతారీఖ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య జి. గులాంతారీఖ్ నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య కె.చంద్రయ్య పదవీకాలం మంగళవారం ముగియడంతో సాయంత్రం గులాంతారీఖ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన యోగివేమన విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రగతి కోసం ఏర్పాటైన విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వవిద్యాలయంలో వైస్ ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో మంచి పాలన అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆచార్య కె. చంద్రయ్యతో పాటు పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
గులాంతారీఖ్ నేపథ్యం..
ఆచార్య గులాం తారీఖ్ కడప నగరం అగాడికి చెందిన ప్రొఫెసర్ డా. షేక్ గులాంరసూల్ (లేట్), అజీమాబి దంపతుల కుమారుడైన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అధ్యాపకవృత్తిలో ఉత్తముడుగా పేరుప్రఖ్యాతులు సాధించారు. తండ్రి వృత్తిరీత్యా తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిలో ఉండగా ఈయన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య సైతం అదే విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. ఎంఫిల్, పీహెచ్‌డీలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. 1983లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో లెక్చరర్‌గా, రీడర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
2008 జూలై యోగివేమన విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరిలో ప్రొఫెసర్‌గా నియమితులైన ఈయన పలు కమిటీల్లో సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. వైవీయూ ఆంగ్లశాఖ విభాగాధిపతిగా, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సెంట్రల్ అడ్మిషన్ సంచాలకులుగా, ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్‌గా, ఎంఈడీ, ఇంగ్లీషు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఆర్ట్స్ విభాగం డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు 2016లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును సైతం ఈయన అందుకున్నారు. ప్రస్తుతం వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయనకు రిజిస్ట్రార్‌గా అవకాశం లభించింది.
ఆంగ్లసాహిత్యంలో పట్టు...
ఆచార్య గులాం తారీఖ్ ‘కంటెపరరీ ఆఫ్రికన్ నావెల్’ అనే పుస్తకాన్ని రచించగా ఢిల్లీకి చెందిన పబ్లిషర్స్ దీనిని ముద్రించారు. దీంతో పాటు 30 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈయన పత్రాలు ప్రచురితమయ్యాయి. 50 వరకు జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్‌లలో పాల్గొని ప్రసంగించారు. బ్రిటీష్ లిటరేచర్, ఆఫ్రికన్ లిటరేచర్, ఇండియన్ ఇంగ్లీషు లిటరేచర్ అన్న అంశాలపై ఈయన పరిశోధన ప్రధానంగా సాగుతోంది. ఈయన వద్ద ఇప్పటి వరకు 10 ఎంఫిల్, మరో 10 మంది పరిశోధక విద్యార్థులు ఈయన మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment