
ఏసీపీ రవిబాబుపై సీపీకి ఫిర్యాదు
పెళ్లి చేసుకుంటానని మోసగించారంటూ దళిత మహిళ ఆరోపణ
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధి మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు తన భర్తతో విడాకులు ఇప్పించి, తనను భార్యగా స్వీకరిస్తానని మోసం చేశాడని పాయకరావుపేట మాజీ ఎంపీపీ, దళిత మహిళ కాకర పద్మలత ఆరోపించారు. ఈ మేరకు ఆమె నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్‌గను కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏసీపీ దాసరి రవిబాబు యలమంచిలి సీఐగా పనిచేసే రోజుల్లో కొన్ని రాజకీయ గొడవలు కారణంగా అతనిని తాను కలవాల్సి వచ్చిందన్నారు. అదే అదునుగా అతను తనను అన్ని విధాలుగా భయాందోళనలకు గురి చేస్తూ, యలమంచిలి కోర్టు వద్ద గల గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని శారీరకంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయటంతో విధిలేక అతనికి సన్నిహితంగా ఉండాల్సి వ చ్చిందని తెలిపారు.
ఒక రోజు తనను భార్యగా స్వీకరిస్తానని చెప్పి, తన భర్తతో బలవంతంగా విడాకులు తీసుకునేలా చేశాడని పద్మలత తెలిపింది. వివాహం విషయమై రవిబాబు వద్ద తాను ఒత్తిడి తీసుకురావడంతో ప్రస్తుత ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలోనే సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. ఈ విషయం ప్రముఖ నేతలు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణకు, అప్పటి విశాఖ జిల్లా డీఐజీ జితేంద్రకు, రూరల్ ఎస్పీ మురళీలకు తెలిసునని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలని సీపీని కోరినట్లు ఆమె తెలిపారు.