భూ సేకరణే రైతులకు లాభం
* రైతు చైతన్యయాత్రలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి
* సీఆర్‌డీఏ బిల్లును చూసి అన్నదాతలెవరూ భయపడొద్దు
* డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకట?
* బడాబాబులకు దోచిపెట్టేందుకు సర్కారు కుట్ర
* రైతులకు న్యాయ సహాయానికి తుళ్లూరు కేంద్రంగా త్వరలో లీగల్ సెల్
సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకంటే భూ సేకరణే రాజధాని రైతులకు ప్రయోజనకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. సీఆర్‌డీఏ బిల్లును చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదని రైతులకు ధైర్యం చె ప్పారు. సమీకరణ, సేకరణల్లోని తేడాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరిచేం దుకే రాజధాని గ్రామాల్లో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం శుక్రవారం రాజ ధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిం చింది. ఉండవల్లి నుంచి బయల్దేరిన ఈ బృందం పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, నవులూరు గ్రామాల్లోని పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది.
సర్కారుకు భూమలివ్వబోమని అక్కడి రైతులు స్పష్టం చేశారు. అనంతరం రైతు నాయకులు అనుమో లు గాంధీ అధ్యక్షతన మందడంలో రైతులతో జరిగిన సమావేశంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రసంగించారు. రైతులు ఇష్టపడితేనే ప్రభుత్వం భూ సమీకరణ జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ భూ సేకరణ జరిపినా రైతులకు లాభమేనని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూమిని మూడో వ్యక్తి అమ్మితే ఆ రోజు ధర ఎంత వస్తుందో.., ఆ ధరకు, మొదట రైతుకు చెల్లించిన రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంలో 40 శాతాన్ని రైతులకు చెల్లించాలని తెలిపారు.
భూములిచ్చిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగమివ్వాల్సిన బాధ్యత కూడా సర్కారుపై ఉందన్నారు. ఈ విషయాలను రైతులకు చెప్పకుండా ప్రభుత్వం భూ సమీకరణ పేరిట బడాబాబులకు ఏజెంటుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస లు డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకని ప్రశ్నించారు. రియల్టర్లు, డెవలపర్ల కోసం ఎందుకు ఏజెంటుగా వ్యవహరించాలని పరోక్షంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు న్యాయపరమైన సలహాలి చ్చేందుకు త్వరలో తుళ్లూరు కేంద్రంగా లీగల్ సెల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. భూ సమీకరణ, భూ సేకరణల్లోని తేడాలపై త్వరలో విస్తృత ప్రచారం చేస్తామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష్యుడు వి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కుట్రను ఎదుర్కొనేందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాదులు జగన్‌మోహన్‌రెడ్డి, శ్యామసుందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతులతో ముఖాముఖి
జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మందడం, లింగాయపాలెం, వెంకటపాలెం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులకు కోర్టులపరంగా లభించే న్యాయాన్ని వివరించారు. ఏ సమస్యకు ఏ విధంగా కోర్టును ఆశ్రయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పారు. ఈ సందర్భంగా లింగాయపాలెం వాసి అనుమోలు హరి లేచి ఎక్కువ మంది భూములివ్వడానికి సుముఖంగా ఉన్నామ ని, తామేం చేయాలో చెప్పాలని ప్రశ్నించా రు. దీంతో అక్కడున్న రైతులు హరిపై మం డిపడ్డారు. రైతులందరి పక్షాన భూములిస్తామని చెప్పడానికి నువ్వెవరంటూ నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది.