అద్భుత హారతి | Adbutha harathi | Sakshi
Sakshi News home page

అద్భుత హారతి

Published Sun, Jul 26 2015 5:07 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

Adbutha harathi

♦ అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాల ముగింపు హారతి
♦ కళ్లు చెదిరేలా బాణసంచా, లక్ష దీపాలు
♦ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు
♦ {పత్యేక అతిథిగా బాబా రామ్‌దేవ్
 
 సాక్షి, రాజమండ్రి : ఆకాశంలో నక్షత్రాలు ఉరుములు, మెరుపులతో భువికి దిగుతున్నట్లు.. గోదారి పాయలో కలిసిపోయి కోటి కాంతులు ప్రవహిస్తున్నట్లు సాగిన ఆధ్యాత్మిక సంరంభం.. గోదావరి హారతి ఆద్యంతం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. రాజమండ్రి పుష్కరాల రేవులో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పుష్కరాల ముగింపు మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరిగింది. పుష్కరాలకు అద్భుత హారతితో శనివారం ముగింపు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా సంప్రదాయ పంచెకట్టుతో ఈ వేడుకకు వచ్చారు. 6.38 గంటలకు నదీమతల్లికి ప్రత్యేక హారతి ఇవ్వడం ద్వారా గోదావరి పుష్కరాలకు ముగింపు పలికారు.

ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పైడికొండల మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులతోపాటు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ మురళీమోహన్ ముందుగానే వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పలువురు స్థానిక, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రత్యేక అతిథిగా వచ్చి సీఎంతో కలిసి ముగింపు వేడుకలను వీక్షించారు.

 హారతి ప్రారంభం, ముగింపు సమయాల్లో సినీ ఫక్కీలో ఏర్పాటు చేసిన బాణసంచా మరింత శోభను తీసుకువచ్చింది. హారతికి ముందు గోదావరి పుట్టుక, ప్రాశస్త్యాలను వివరిస్తూ తనికెళ్ల భరణి వ్యాఖ్యానంతో లేజర్ షో ప్రదర్శించారు. అనంతరం శాండ్ ఆర్ట్‌తో పుష్కరాల ముగింపును కళాత్మకంగా పలికారు. హారతి ఇస్తున్న సమయంలోనే గోదావరిలో పడవలు, బోట్ల నుంచి లక్ష దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. హారతి జరిగే ప్రదేశానికి వెనుకనుంచి నదీ ప్రవాహంలో ఆ దీపాలు సాగిపోయాయి. రెండు వంతెనల మధ్య గోదావరి హారతి అనంతరం రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి పేరుతో ఆకాశదీపం వెలిగించారు.

వందలాది ఆకాశదీపాలు బెలూన్లలో దానిని అనుసరించాయి. అనంతరం జరిగిన బాణసంచా, లేజర్ షోలతో ఆకాశం రంగుల హరివిల్లులా మారింది.    ముగింపు వేడుకలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షించారు. గోదావరి హారతి, బాణసంచాతోపాటు రెండు వంతెనలకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ వరకూ అన్నిటిలోనూ ప్రత్యేకత తీసుకువచ్చారు. పుష్కర యాత్రికులు బోయపాటిని అభినందనల్లో ముంచెత్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement