కర్నూలు(రాజ్‌విహార్) : వాణిజ్య పన్నుల శాఖ అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ (ఏడీసీ) కార్యాలయానికి మంగళం పాడేందుకు కసరత్తు జరుగుతోంది. రాయలసీమ వాసుల కోసం కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని విజయవాడలోని ఏడీసీ ఆఫీస్‌లో విలీనం చేసేందుకు యత్నాలు జరగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాదులోని సీమ ట్రిబ్యూనల్ కోర్టు బెంచ్‌ను విశాఖపట్నంకు తరలిం చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ కన్ను ఏడీసీ కార్యాలమంపై పడింది.
కోస్తాంధ్ర తెలుగుదేశం నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వనరులను తమ ప్రాంతాలకు లాక్కెళ్లడమే లక్ష్యంగా ఉన్నారు. వాళ్ల కనుసన్నల్లో పరిపాలన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతరుల ఇబ్బందులు, కష్టాలను పట్టించుకోవడం మానేశారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని కాదని రాజధానిని విజయవాడకు తరిలించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులోని వాణిజ్య పన్నుల శాఖ ట్రిబ్యూనల్ బెంచ్‌ను ఎత్తేసి కోస్తాలోని విశాఖపట్నం బెంచ్‌లో విలీనం చేశారు. కృష్ణా బోర్డు ఏర్పాటు పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. ఇప్పుడు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ అప్పిలేట్ కార్యాలయాన్ని ఎత్తేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం కర్నూలులో ఉన్న ఈ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలోని కార్యాలయంలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు
అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలో విలీనం చేస్తున్నట్లు ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయితే, కొంత మంది యూనియన్ నాయకులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా దీనిపై మాట్లాడలేము. ఉన్నతాధికారుల సూచనల మేరకు కార్యాచరణ ఉంటుంది.
- తాతారావు, డిప్యూటి కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, కర్నూలు
వ్యాపారులకు ఇబ్బందులే
అప్పీలేట్ డిప్యూటి కమిషనర్ కార్యాలయాన్ని ఎత్తేసి విజయవాడలో విలీనం చేస్తే వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల డీలర్లు, ట్రాన్స్‌పోర్టు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో నియామకాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంది.
- జీ.ఎం. రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీఓ సంఘం
ఏడీసీ కార్యాలయం ఎత్తివేత?
Published Tue, Mar 3 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement