మళ్లీ ఆధార్ అగచాట్లు
- సుప్రీంకోర్టు మొట్టి కాయలేసినా ముందుకు
- రైతు రుణమాఫీకీ లింకు
- జిల్లాలో పలువురికి అంద నికార్డులు
- ప్రజల గగ్గోలు
నెల్లూరు(టౌన్): మీకు గ్యాస్, రేషన్ సరుకులు, పింఛన్ కావాలా? ఇవే కాదు భారతీయుడనే గుర్తింపు కావాలా? అయితే ఆధార్ కార్డు ఉండాల్సిందే. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని రెండేళ్ల క్రితం సర్కార్ బెదరగొట్టింది. దీంతో ప్రజలు ఉరుకులు, పరుగులపై ఆధార్ కేంద్రాలకు పరుగులు తీశారు. అందరికీ ఆధార్ కార్డులు అందకనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ చేశారు. దీంతో ప్రజల్లో అలజడి చెలరేగింది.
కుటుంబ సభ్యులంతా ఏక కాలంలో ఆధార్ తీయించుకున్నప్పటికీ భార్యకు వస్తే భర్తకు రా లేదు. అలాగే బిడ్డకు కార్డు వస్తే తండ్రికి రాలే దు. దీనిని నిరసిస్తూ కొం దరు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పందిస్తూ అన్నింటికీ ఆధార్‌ను వర్తింపజేయడం సరైంది కాదని గత ఏడాది తీర్పు చెప్పింది. ఆధార్‌తో సంబంధం లేకుండా గ్యాస్, రేషన్ లాంటి నిత్యావసర సరుకులు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ఆదేశించింది.
రుణమాఫీకి సైతం లింకు
అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజేపీ సైతం ఇప్పుడు పాడిందే పాడరా.. అనే చందాన గత సర్కార్ పల్లవిని అందుకుంది. ఆగస్టు నాటికి ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కాలంటే ఆధార్ తప్పనిసరి అని తేల్చింది. అప్పుడు విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆధార్‌ను శరవేగంగా అన్ని పథకాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. చివరికి రైతుల రుణమాఫీకి
ఆధార్‌కు లింకు పెడుతున్నారు.
పౌరసరఫరాల అధికారుల కాకి లెక్కలు:
జిల్లాలో 29,66,082 మంది ప్రజలున్నారు. వీరిలో 25,77,612 మందికి ఆధార్‌ను తీశారు. ఇక 3,88,470 మందికి మాత్రమే ఆధార్ కోసం ఐరిష్ తీయాలి. ఈ లెక్కన 87 శాతం పూర్తయిందని పౌరసరఫరాల అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు.
వాస్తవమిదీ..
పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్న జిల్లా జనాభా రెండేళ్ల క్రితం నాటిదే. ప్రస్తుతం 31 లక్షల మంది వరకు జిల్లాలో ఉన్నారు. ఐరిష్ తీసుకున్న వారిలో దాదాపు 4 లక్షల మందికి కార్డులు రాలేదు. ప్రస్తుతం మరో 3.88 లక్షల మందికి ఐరిష్ తీయాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు 8 లక్షల మందికి జిల్లాలో కార్డులు లేవన్న మాట. కార్డులు ఎందుకు రావడం లేదని రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను అడిగితే పైనుంచి రావాలని, తామేమీ చేయలేమంటున్నారు.
ఉదాహరణలివీ..
- కొడవలూరు మండలం సంజీవనగర్‌లో గుంజి రత్నమ్మ అనే మహిళ మూడు సార్లు కార్డు కోసం ఐరిష్ తీసుకున్నా ఇప్పటికీ రాలేదు.
- సాక్షాత్తు జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు రెండు సార్లు ఐరిష్ తీసుకున్నా కార్డు రాలేదు.