సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్యాస్ సిలిండర్ రాయితీ ఇకపై బ్యాంకు ఖాతాలోనే జమ కానుంది. నేటినుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 31నాటికి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే ఈ ఆదేశాలపై యంత్రాంగం అలసత్వంగా వ్యవహరించిందో.. లేక అమలు ప్రక్రియ భారమైందో గానీ జిల్లాలో కేవలం 41.2 శాతం వినియోగదారుల ఆధార్ వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాతో
అనుసంధానమయ్యాయి. జిల్లాలో 55 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 13,15,157 గ్యాస్ కనెక్షన్లున్నాయి. శనివారం గడువు ముగిసే నాటికి కేవలం 5,41,263 మంది వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. దీంతో వీరికి మాత్రమే నగదు బదిలీ వర్తించనుంది.
అడుగడుగునా నిర్లక్ష్యమే..!
జిల్లాలో ఆధార్ నమోదుపై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు ఏడాదిన్నరగా జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 105శాతం నమోదు ప్రక్రియ పూర్తిచేసినట్లు ఓవైపు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. మరోవైపు జిల్లాలో కొనసాగుతున్న 200 ఆధార్ కేంద్రాల వద్ద నమోదు కోసం జనాలు బారులు తీరుతున్నారు. అంటే నమోదు ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా సాగిందో స్పష్టమవుతోంది. మరోవైపు ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసేందుకు అధికారులు దాదాపు ఆర్నెల్ల క్రితం చర్యలకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు కేవలం 41.2శాతం మాత్రమే పూర్తిచేశారు. ఈ ప్రక్రియలో గ్యాస్ ఏజెన్సీలను భాగస్వామ్యం చేసినప్పటికీ.. నత్తనడకన సాగుతోంది. అలసత్వం వహించే ఏజెన్సీలను రద్దు చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన యంత్రాంగం.. కేవలం ఇలాంటి ప్రకటనలకే పరిమితమైంది.
వారికి మార్కెట్ ధరకే సిలిండర్...
ఆధార్ వివరాలు బ్యాంకు ఖాతాతో అనుసంధానం (సీడింగ్) కానివారికి ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధరకే విక్రయించనున్నారు.
సీడింగ్ ప్రక్రియ పూర్తి చేసిన వారికి రాయితీ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. మిగిలిన వినియోగదారులకు సీడింగ్ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే ఈ రాయితీ ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. దీంతో వారి రాయితీ నిధులు ఎప్పుడందుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారుల సంఖ్య
ఆయిల్ కంపెనీ మొత్తం వినియోగదారులు సీడింగ్ అయినవి
బీపీసీ 163292 67452
హెచ్‌పీసీ 510099 225976
ఐఓసీ 641766 247835
నేడూ పనిచేయనున్న బ్యాంకులు
గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సమర్పించడానికి వీలుగా ఈ ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ తెలిపారు. ఇప్పటికీ ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేకపోతే సబ్సిడీ వర్తించదని, పూర్తి డబ్బులు చెల్లించి సిలిండర్ పొందాల్సి ఉంటుందని, శనివారంతోనే గడువు ముగిసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతా లేని వినియోగదారులు కొత్త ఖాతాలు తెరుచుకోవాలని సూచించారు.
ముగిసిన ఆధార్ సీడింగ్ గడువు
Published Sun, Sep 1 2013 12:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement