నషాళానికి నిషా!
మంత్రుల ఇలాకాల్లో గ్రామానికి ఐదు నుంచి ఎనిమిది బెల్టు షాపులు
అధికరేట్లకు మద్యం విక్రయాలు
మామూళ్ల మత్తులో అధికారులు
ప్రమాణ స్వీకార వేదికపై సీఎం సంతకం చేసిన ఫైలు బుట్టదాఖలు
డిమాండ్‌ను బట్టి గ్రామాల్లో బెల్టు షాపులకూ వేలం..!
గుంటూరు : జిల్లా వ్యాప్తంగా మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు చిత్తూరులో మిగిలిపోయిన 10 మద్యం దుకాణాలను జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేశారు. వీటితోపాటు వాడకో బెల్టుషాపు పెట్టి మందుబాబులను నిండా ముంచేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే బెల్టు షాపులు రద్దుచేస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇంకేముంది అధికారులు బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తారని అంతా భావించారు. షరా‘మామూలే’.. గ్రామాల్లో బెల్టు షాపులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని తొలగించాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బార్ కోడింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తే బెల్టు షాపుల్లో అమ్మే మద్యం ఏ మద్యం దుకాణం నుంచి వచ్చిందో గుర్తించి చర్యలు తీసుకోవచ్చని ఎక్సైజ్ ఉన్నతాధికారులు భావించారు. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో అది ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. కొల్లూరు మండలంలోని గ్రామాల్లో బెల్టు దుకాణాలకు సైతం తీవ్ర పోటీ ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. అక్కడ వేలం ద్వారా బెల్టు షాపులు కేటాయించారు. ఒక్కో దుకాణానికి రూ.5 నుంచి రూ.8 లక్షల చొప్పున వేలం పాడి దక్కించుకున్నారు. ఈ డబ్బంతా మద్యం దుకాణాల నిర్వాహకులు తీసుకున్నారు. ఇక్కడ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత, మండల ముఖ్యనేతలదే మద్యం సిండికేట్ కావడం గమనార్హం.
ఎమ్మార్పీ కంటే అధికంగా..
జిల్లాలో ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా క్వార్టర్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.15 నుంచి రూ.20 వరకు, రాత్రి సమయాల్లో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.40 వరకు పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నారు.
వాటాకోసం బేరసారాలు..
ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపితే వచ్చే లాభంలో తమకు కూడా వాటాలు ఇచ్చేలా మద్యం సిండికేట్ల వద్ద బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మా పైవాళ్లకు సైతం నెలవారీ మామూళ్లు పంపాలంటూ మద్యం దుకాణాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. మద్యం సిండికేట్లు అత్యధికంగా అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తుండటంతో ఎక్సైజ్ అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హడావుడి చేస్తే ఇలా...
పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల, కారంపూడి, దాచేపల్లి, వినుకొండ, నరసరావుపేట వంటి చోట్ల ఒకవేళ ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరపాలంటూ మందుబాబులు హడావుడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండ్‌లన్నీ పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని బ్రాండ్లను అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు వారికి కావాల్సిన బ్రాండ్లను మాత్రమే తాగుతారని తెలిసిన మద్యం వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.