పోలీసుశాఖలో ఆధునిక పరిజ్ఞానం
Published Fri, Oct 25 2013 2:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :సిబ్బందిలో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు పోలీస్‌శాఖ శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా విడతల వారీగా ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ ప్రారంభించింది. ఈ పరిజ్ఞానం ద్వారా శాఖను పటిష్ట పర్చడంతోపాటు నేరస్తుల ఆటకట్టించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులను స్థానిక అధికారులే కాకుండా ఉన్నతాధికారులు కూడా క్షణాల్లో తెలుసుకునేలా పోలీస్‌స్టేషన్‌లను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందుకుగాను ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నాలుగు కంప్యూటర్లను కేటాయిస్తారు.
ఒక్కసారి క్లిక్ చేస్తే...
గతంలో నేరస్తుల వివరాలను అధికారులు తెలుసుకోవాలనుకుంటే జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిస్ట్రిక్‌క్రైమ్ రికార్డ్సు బ్యూరో (డీసీఆర్బీ) లో వుండే రికార్డులను పరిశీలించేవారు. రికార్డుల్లో వుండే అరకొర సమాచారం ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టేవారు. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకు రావడంతో కేసుల నమోదు వివరాలు, నేరస్తుల వివరాలను నివేదికలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. కొత్తగా ‘క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ అనే అప్లికేషన్‌ను కూడ నేరస్తుల వివరాలతో జతచేశారు. అప్లికేషన్‌లో నేరస్థుడి పేరు, చిరునామా, వేలిముద్రలు, గతంలో నేరాలకు పాల్పడిన వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. సాధారణ వ్యక్తులకు పోలీస్ సాఫ్ట్‌వేర్ సమాచారం తెలియకుండా ప్రత్యేక పాస్‌వార్డ్ ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత విభాగం పర్యవేక్షించే అధికారులు దేశంలోని ఏమూల నుంచైనా ఒక్క క్లిక్ చేస్తే నేరస్తుల పూర్తి సమాచారం క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలిగింది.
అందుబాటులో సీసీటీఎన్‌ఎస్
నేరస్తుల కదలికల నిఘా కొనసాగించేందుకు వారి కదలికలను తెలుసుకునేందుకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కరుడుకట్టిన నేరస్తులైనా నిఘా నుంచి తప్పుకోలేని విధంగా నూతన విధానాన్ని రూపొందించారు. దీనిపై కూడా సిబ్బందికి రెండు రోజులు పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ-కాప్స్‌గా .. గతంలో పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు చేతితోరాసి కేసు నమోదు చేస్తుండేవారు. వాటికి మరో మూడు ఫోటోస్టాట్‌లను తయారు చేసి డీఎస్పీ, సీఐ, న్యాయస్థానానికి పంపేవారు. అనంతరం టైప్‌మిషన్లపై సీడీ ఫైల్‌ను తయారు చేయించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లుతుండేవి. ఎఫ్‌ఐఆర్‌లో పలు పేర్లను తొలగించటం, వచ్చిన ఫిర్యాదులపై రెండు కేసులు నమోదు చేయటం వంటి పొరపాట్లు దొర్లుతుండేవి.
వీటికి తోడు ఆయా కేసులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు తెలుసుకోవాలంటే అదే పోలీసుస్టేషన్‌కు వె ళ్లి పరిశీలించాల్సివచ్చేది. పోలీసుస్టేషన్లలో రికార్డు రూములు సక్రమంగా లేకపోవటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో ఆధునిక పరిజ్ఞానం పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకురావటంతో ప్రత్యేకంగా ఇంట్రానెట్(ఈ కాప్స్)పేరుతో స్టాఫ్‌వేర్‌ను ప్రతి పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు అనుసంధానం చేశారు. దీంతో నేరస్తులను పట్టుకోవటంతోపాటు పరిపాలనా పరమైన అంశాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కాప్స్‌ను ఆధునికీకరించి వేగవ తమైన సేవల కోసం విండోస్ ఎక్స్‌పీ స్థానంలో నూతనంగా యుబుంటును అందుబాటులోకి తెచ్చారు. ఈవిధానం అమలులోకి రావటంతో మరింత వేగవంతంగా అధికారులు సమాచారం తెలుసుకోగలుగుతున్నారు.
శిక్షణ కీలకం: ఎస్పీ
జిల్లాలో మొత్తం ఐదు వేల మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఈ కాప్స్, సీసీటీఎన్‌ఎస్ తదితర ఆధునిక పరిజ్ఞానంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఇది సిబ్బంది విధి నిర్వహణలో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండే నేరస్తులను గుర్తించి ఆదుపులోకి తీసుకొవచ్చాన్నారు. సైబర్ నేరాలను పరిష్కారించటంలో ఆధునిక పరిజ్ఞానం అవసరమని గుర్తించి బ్యాచ్‌లు వారీగా శిక్షణ కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు.
Advertisement