ఖమ్మం కల్చరల్/ భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: అక్కినేని నాగేశ్వరరావుతో జిల్లావాసులు తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శోకతప్తులవుతున్నారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకునేందుకు 1978లో తోటి ఆర్టిస్టులతో కలిసి జిల్లాకేంద్రంలో ఆయన విరాళాలు సేకరించింది మొదలు.. భద్రాద్రి రాముని సన్నిధిలో పలు చిత్రాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భాలను స్మరిస్తూ బాధాతప్తులవుతున్నారు. అక్కినేని అభిమానులు బుధవారం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు.
దివిసీమ ఉప్పెనబాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పది కేంద్రాల్లో సినీ కళాకారులు రూ.10 లక్షల విరాళాలు సేకరించగా దానిలో ఒక్క ఖమ్మంలోనే రూ.2.78 లక్షలు వసూలు కావడం గమనార్హం.
ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్‌లో అక్కినేని, జయసుధ, అల్లు రామలింగయ్య తదితరులు నటించిన ‘కొడుకు పుట్టాలా..’ హాస్య నాటిక అలరించింది. - 1999 ఫిబ్రవరి11న ఖమ్మంలో ‘భలేమంచిరోజు’ పేరుతో నిర్వహించిన ఘంటసాల గాన విభావరికి అక్కినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
2001 ఫిబ్రవరి15న వైరాలో కొండబోలు వెంకయ్య మెమోరియల్ కళాశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు. అదేరోజు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా కళాకారుల ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలిసారి ‘ఇల్లరికం’ చిత్ర షూటింగ్ కోసం భద్రాచలం వచ్చినట్లు శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థాన విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు తెలిపారు.
ఆ తర్వాత అందాల రాముడు చిత్రాన్ని దాదాపు 90శాతం గోదావరి పరిసరాల్లో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. భద్రాద్రికి ఖ్యాతినార్జించి పెట్టడంలో ఈ చిత్రం దోహదపడిందని అర్చకులు అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా రామాలయంలో భద్రుని గుడి ఎదుట ఉన్న శాసనస్తంభాల వద్ద అక్కినేని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారని చెబుతున్నారు. ఆయనకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారట. ఆయనతోపాటు ప్రముఖ నటులు నాగభూషణం, రాజబాబు మరికొంత మంది ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు.’
అందాలరాముడు తర్వాత ‘దొరబాబు’ చిత్రం షూటింగ్‌ను భద్రాచలం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారని రామాలయ ప్రస్తుత ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు.
నాగార్జున హీరోగా శ్రీరామదాసు చిత్రంలో రామదాసు గురువు కబీర్‌దాస్‌గా అక్కినేని నటించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రామాలయ పరిసర ప్రాంతంలోనే ఘనంగా జరిపారు. నాగేశ్వరరావు, నాగార్జునను ఆయన అభిమానులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు.
చిట్టచివరిగా 2011 ఆగష్టు 15వ తేదీన బాపు దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా యలమంచిలి సాయిబాబా నిర్మాతగా నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ ఆడియో ఆవిష్కరణకు అక్కినేని ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం వచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అవార్డుల కంటే అభిమానుల సంతృప్తే నా ధ్యేయం. మనిషికి ఆత్మ సంతృప్తి ప్రధానం. ఆత్మకు, దేవునికి రూపాలులేవు. ఈ రెండూ ఒక్కటే.’ అన్నారు. అక్కినేనితో అనుబంధాన్ని ఆలయ అర్చకులు, జిల్లా కళాకారులు, అభిమానులు గుర్తు చేసుకున్నారు.