
అంతా 23 తర్వాతే..
అంతా 23 తర్వాతే..
సాక్షి, విజయవాడ :
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వలేకపోయారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభను ముగించుకుని శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత చంద్రబాబు విజయవాడ చేరుకుని బందరు రోడ్డులోని ఒక హోటల్‌లో బస చేశారు.
ఆదివారం ఉదయం వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా ఆయన్ని కలిసేందుకు హోటల్‌కు వచ్చారు. దీంతో చంద్రబాబు బస చేసిన రూమ్ బయట ఆశావహులతో నిండిపోయింది. తనను కలిసి కొద్దిమంది నేతలతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈ నెల 23 తరువాతనే అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.
పొత్తులపైనా స్పష్టత ఇవ్వని వైనం...
టీడీపీకి ఏయే పార్టీలతో పొత్తు ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు నుంచి తెలుసుకునేందుకు పార్టీ నేతలు ఉత్సుకత ప్రదర్శించారు. దానిపైనా ఆయన స్పష్టత ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర విభజనపై స్పష్టత వస్తుందని, ఆ తరువాత పరిస్థితుల్ని సమీక్షించుకుని పొత్తులపై నిర్ణయించుకోవచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. దీంతో విజయవాడలో సీట్లపై కూడా ఎవరికీ ఏ విధమైన హామీ లభించలేదు.