సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు సిటీ, సర్వేపల్లి శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు పార్టీ మార్చే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తెలుగుదేశంలోకి వెళ్తున్నట్టు ప్రచార సాధనాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ వారు ఎక్కడా ఖండించిన దాఖలాలు కూడా లేవు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇద్దరు ఎమ్మెల్యేల పునఃప్రవేశం గురించి అంతర్గత సంభాషణల్లో ఔననే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం శాసన సభ్యులిద్దరూ నగరంలోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ సందర్భంగా వారి మధ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టే విషయమై ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. తాము టీడీపీలోకి వెళ్లడం ఖాయమైనప్పటికీ జిల్లాలో కిరణ్ పార్టీలో ఎవరెవరు చేరుతారనే అంశంతో పాటు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. సంక్రాంతి పండగ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23వ తేదీ తరువాత పార్టీ మార్చే విషయంపై తమ నిర్ణయం వెల్లడిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో పాటు కొన్ని తేల్చుకోవాల్సిన అంశాలు కూడా ముడిపడి ఉన్నట్టు తెలిసింది.
నెల్లూరు సిటీ తెలుగుదేశం టిక్కెట్టుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి రమేష్‌రెడ్డితో పాటు నగర పార్టీ కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముంగమూరుకు టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం వచ్చింది. అయితే నందమూరి బాలకృష్ణ నుంచి తనకు టిక్కెట్టుపై హామీ ఉందని కోటంరెడ్డి ప్రచారం చేస్తున్నారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి పార్టీ మారడానికి ముందుగానే టిక్కెట్టుపై హామీ కోరవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంగతిపై కూడా 23వ తేదీలోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా నెల్లూరు సిటీ టిక్కెట్టును మహిళలకు కేటాయించాలనే కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది.
నాలుగైదు రోజుల్లో ఈ డిమాండ్‌తో సిటీ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు చంద్రబాబును కలిసేందుకు రాజధానికి వెళ్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి శాసనసభకు పోటీ చేయాలా? నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలా ? అనే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తంగా నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మాత్రం అభ్యర్థులపై అయోమయం ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే ఈ నెల చివరివారం వరకు వేచిచూడక తప్పదు.
23 తర్వాతే..
Published Fri, Jan 3 2014 3:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement