sridhar krishna reddy
-
ఫ్యాన్ దే హవా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతం సాధించిన వైఎస్సార్ సీపీ జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తన సత్తా చాటింది. మాజీ మంత్రి ఆనంరామనారాయణరెడ్డిని తొలి ప్రయత్నంలోనే యువకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి మట్టి కరిపించి భారీ విజయం సొంత చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో తనను ఓడించిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మీద వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని మట్టి కరిపించి భారీ ఆధిక్యతతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని ఈసారి వైఎస్సార్సీపీ గెలుపొందింది. నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి మీద గెలుపొందారు. జిల్లాలో ఈ ఫలితాలను ఊహించలేక పోయిన టీడీపీ డీలా పడింది. తొలిప్రయత్నంలోనే గౌతమ్ విజయం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ దిగ్గజమైన ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ అభ్యర్థి గూటూరు కన్నబాబును ఈయన ఎదుర్కున్నారు. ప్రతి రౌండ్లోనూ భారీ ఆధిక్యత సాధిస్తూ 31,412 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సొంతం చేసుకున్నారు. జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేల్లో ఇంత భారీ మెజారిటీ గౌతమ్‌రెడ్డికే దక్కింది. రాజకీయ ఆరంగేంట్రం చేసిన తొలి రోజు నుంచి ఆయన ఆత్మకూరులో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకోవడం, యువకుడిగా నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావడం ఆయన విజయానికి దోహదపడింది. గౌతమ్ దెబ్బకు ఆనంకు డిపాజిట్ గల్లంతైంది. నియోజకవర్గంలో ఇప్పటి దాకా ఎవరూ సొంతం చేసుకోని భారీ ఆధిక్యత ఆయన దక్కించుకున్నారు. దెబ్బకు దెబ్బ నెల్లూరు సిటీ నుంచి 2009లో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్‌లోని రాజకీయ కుట్రలతో అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత మూడున్నరేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్న ఆయన ఈ సారి అనూహ్యంగా శ్రీధర్ కృష్ణారెడ్డితోనే తలపడాల్సి వచ్చింది. శ్రీధర్ కృష్ణారెడి ్డ కాంగ్రెస్ నుంచి పార్టీ మారి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగినా ప్రయోజనం లేక పోయింది. అనిల్ కుమార్ ఈసారి తన ప్రత్యర్థి ముంగమూరును 19,820 ఓట్ల తేడాతో మట్టి కరిపించి రెండో ప్రయత్నంలో ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అనిల్ విజయం ముంగమూరుకు భారీ షాక్ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం చెంచుసుబ్బారెడ్డి 3971 ఓట్లు మాత్రమే సాధించుకున్నారు. బీద కోటకు బీటలు కావలిలో రెండో సారి గెలిచి తీరాలని టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్‌రావు శక్తికి మించి శ్రమించినా ఫలితం దక్కలేదు. 2009లో కావలి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్ రావు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ప్రతాప్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయంగా బలమైన వ్యక్తి అయితే బీద మస్తాన్‌రావు కోటను బద్ధలు కొట్టి ఆయన్ను ఓడించారు. నువ్వా? నేనా అనేలా సాగిన పోరులో ప్రతాప్‌కుమార్‌రెడ్డి 4971 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొలి ప్రయత్నంలోనే కోటంరెడ్డి .. అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రయత్నించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిపోటీలోనే ఆ కోరిక నెరవేర్చుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవ ర్గం మీద గురిపెట్టిన ఆయన గత మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ నాయకుడిగా జనంలో ఉంటూ వచ్చారు. ఈ స్థానం టీడీపీ, బీజేపీ పొత్తులో బీజేపీకి దక్కడం కూడా కోటంరెడ్డికి లాభించి 25 వేల పైచిలుకు మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. సంజీవయ్యకు ఊహించని అదృష్టం హౌసింగ్ శాఖలో డీఈగా పనిచేస్తున్న కిలివేటి సంజీవయ్య ఊహించని విధంగా తొలి పోటీలోనే అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఏడాది కిందట ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం కంచుకోటైన సూళ్లూరుపేటలో ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసారత్నంను మట్టి కరిపించారు. అనూహ్యంగా ఆయన 3726 మెజారిటీతో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యే దాకా సునీల్ గూడూరు మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన పాశం సునీల్ కుమార్ వైఎస్సార్ సీపీ తరపున తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక్కడ రాజకీయాలకు కొత్త అయిన డాక్టర్ జ్యోత్స్నను టీడీపీ బరిలోకి దించి చేసిన ప్రయోగం ఫలించలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో సునీల్ టీడీపీ కోటలు బద్ధలు కొట్టి 9088 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బొల్లినేనికీ తొలిసారే ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బొల్లినేని వెంకటరామరావు కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2012లో జరిగిన ఉదయగిరి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి కూడా అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్కంఠ భరితంగా నువ్వా? నేనా అనేలా సాగిన ఎన్నికల్లో ఆయన వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి మీద 4673 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాకాణికీ తొలిసారే సర్వేపల్లి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాణి గోవర్ధనరెడ్డి టీడీపీలో కీలక నాయకుడైన సోమిరెడ్డిని ఓడించి మొదటి ప్రయత్నంలోనే గెలుపొంది తొలిసారి అసెం బ్లీలో అడుగుపెడుతున్నారు. విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన సోమిరెడ్డిని కాకాణి 5447 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా రు. మూడున్నరేళ్లుగా ఆయన జనంలోనే ఉంటూ రావడం విజయం వైపు నడిపించింది. కురుగొండ్ల రెండో విజయం వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణ వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందిన ఆయనకు ఈసారి టికెట్ రావడం అనుమానంగా కనిపించినప్పటికీ చంద్రబాబును ఎలాగోలా ప్రసన్నం చేసుకుని టి కెట్ సాధించుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కున్న ఆయన విజయం గురించి తీవ్ర ఆందోళన పడ్డారు. గెలుపెవరిదో అనేలా సాగిన కౌంటింగ్‌లో చివరకు ఆయన 5525 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోలంరెడ్డి రెండోసారి కోవూరులో 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 400 ఓట్ల పై చిలుకు మెజారిటీతో ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోలంరెడ్డి గెలిచారు. 2009 సార్వత్రిక, 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి కోవూరు అభ్యర్థిగా పోటీ చేసి 7942 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో సారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. -
ముంగమూరు ‘ఛీ’ధర్
సాక్షి, నెల్లూరు : కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే అయిన కొత్తల్లో నగర వాసులు జోకులేసేవారు. పార్టీలు మారుతూ నెల్లూరు నగరాన్ని దోచుకున్న ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మళ్లీ నాటి కుట్రలకు పాల్పడటం నగర వాసులకు మింగుడు పడటంలేదు. నాడు ఆనం కుట్రలతో పీఆర్పీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆనం పంచన చేరారు. ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా ముంగమూరు నేడు టీడీపీ అభ్యర్థిగా అవతారమెత్తి మళ్లీ అవే కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ఆనం సోదరుల అండతో వైఎస్సార్సీపీని అడ్డుకునేందుకు వ్యూహరచన చేశారు. అయితే జనం ఇటు ఆనం, అటు ముంగమూరుకు ఒకేసారి రాజకీయ సమాధి కట్టేందుకు సర్వం సిద్ధం చేశారన్నది పరిశీలకుల అభిప్రాయం. నగర ఎమ్మెల్యేగా, రూరల్ ఎమ్మె ల్యే ఆనం వివేకానందరెడ్డితో చెట్టపట్టాలేసుకొని ఎక్కడబడితే అక్కడ అవినీతి డ్యూయట్లు పాడిన వీళ్లతంతు అందరికీ తెలిసిందే. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తుస్మంటుందని ముందే గ్రహించిన ముంగమూరు వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. మాటపై నిలబడే వైఎస్సార్సీపీ అధినేత తలుపులు మూసివేయడం తెలిసిందే. దీంతో మళ్లీ అదే కుట్రతో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. పార్టీల మారినా మనిషి బుద్ధి మారదు అనడానికి ఉదాహరణ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి. పార్టీ ఏదైనా ఆనం సోదరులతో ఉండే అనుబంధాన్ని కొనసాగించడం, అధికారం కోసం కొంగజపాలు చేయడం అల వాటు. తన ప్రత్యర్థి ,వైఎస్సార్సీపీ అభ్యర్థి అనీల్‌కుమార్ యాదవ్‌ను ఇబ్బంది పెట్టేం దుకు మళ్లీ కుమ్మక్కు రాజకీయాలకు పూనుకున్నారు. నగర రోడ్లకు రూ.300 కోట్లు? ముంగమూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరంలో రూ.300 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. అవసరమున్న చోట రోడ్లు వేయకుండా, ఉన్న రోడ్లపైనే నాసిరకంగా వేసి కోట్లాది రూపాయలను ముంగమూరు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కార్పొరేషన్లో టెండర్ల వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత ముంగమూరుకే దక్కింది. కార్పొరేషన్లో మొత్తం 180 మందికిపైగా కాంట్రాక్టర్లు ఉండగా ముంగమూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేవలం ఆయన కుటుంబసభ్యులు మాత్రమే కాంట్రాక్టర్ల అవతారమెత్తి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని విమర్శలు లేకపోలేదు. ముంగమూరు పాలనలో నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారి నెల్లూ రు దోమల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఆక్రమణల పర్వం నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో ముంగమూరు అనుచరులు కోట్లాదిరూపాయల విలువైన స్థలాలను కబ్జా చేశారు. నచ్చనివారికి అనుమతులు ఇవ్వకపోవడమే కాకుండా ఆక్రమణల పేరుతో పలు ఇళ్లను, అపార్టుమెంట్లను కొల్లగొట్టిన ఘనత ముంగమూరుకే దక్కింది. ఇక రూరల్ పరిధిలో పెన్నానది సమీపంలో రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లే అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆర్కే నగర్లో.. నగరంలోని ఆర్కే నగర్, గాండ్లవీధి ప్రాం తంలో 22 ఎకరాల దేవుని మాన్యం స్థలాన్ని కాజేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ముంగమూరు కుటుంబంపై ఉన్నాయి. బుజ్జమ్మతోట పేరుతో ఉన్న ఈ స్థలాన్ని ఆమె చనిపోతూ 1944లో రంగనాయకులస్వామి గుడికి బొమ్మిరెడ్డి సుబ్బరత్నమ్మ పేరున ఇచ్చారు. ఆ తర్వాత చినస్వామినాయుడు అనే వ్యక్తి కౌలుకు చేస్తున్న ఈ భూమిని ముంగమూరు కుటుంబం వశం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత దాదాపు 22 ఎకరాల స్థలాన్ని ఆర్కేనగర్ గాండ్లవీధి ప్రాంతాన్ని ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇది దేవుని మాన్యం కావడంతో కొన్నవారికి పట్టాలు కాలేదు. ఇప్పటికీ పట్టాలు ఇస్తామని చెబుతూ ముంగమూరు కుటుంబం ఆ ప్రాంత ప్రజలను మభ్యపెడుతూనే ఉంది. ముంగమూరు ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా దాదాపు 1000 కుటుంబాలకు పట్టాలు దక్కలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ముంగమూరు ఎమ్మెల్యే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1987లో స్థలాలు ఆక్రమించారంటూ దేవాదాయశాఖ ఆ ప్రాంత ప్రజలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముంగమూరుకు చేరవేసినా అదిగో.. ఇదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబు తున్నారని వారు ‘సాక్షి’తో వాపోయారు. దోమలమందు పంపిణీలో సైతం అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెలుపు కోసం అడ్డదారులు తొక్కేం దుకు వెనకాడని ముంగమూరుకు నగరవాసులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. -
చిరు పోస్టర్లపై నల్లరంగు పూసిన టిడిపి కార్యకర్తలు
నెల్లూరు: నగరంలో పోస్టర్ల వివాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్న పోస్టర్లపై టిడిపి కార్యకర్తలు నల్లరంగు పూశారు. నెల్లూరు నగర శాసన సభ్యుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి టిడిపిలో చేరనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్కృష్ణా రెడ్డి, బండారు సత్యానందరావులు ఆ పార్టీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. వారిలో శ్రీధర్ కృష్ణారెడ్డి టిడిపిలో చేరుతున్న సందర్భంగా పోస్టర్లు వేయించారు. ఆ పోస్టర్లే వివాదానికి దారితీశాయి. ఆయన వేయించిన పోస్టర్లలో చిరంజీవి ఫొటో ఉంది. ఆయన ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుపొందారు. ఆ అభిమానంతో ఆయన చిరంజీవి ఫొటో పోస్టర్లో వేయించినట్లున్నారు. అది టిడిపి కార్యకర్తలకు గిట్టలేదు. వారు అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఆ పోస్టర్లపై నల్లరంగు పూశారు. -
ముంగమూరుతోనే ఢీ
= నెల్లూరు నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న వివేకా = ఆదాలతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేకే... = శ్రీధర కృష్ణారెడ్డికి మూడు చెరువుల నీళ్లు తాగించాలని పట్టుదల సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ నేటి దాకా తన మిత్రుడైన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి మీద రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పోటీకి సై అంటున్నారు. 2009 ఎన్నికల్లో తమ సహకారంతో గెలుపొందిన ఆయన ఇప్పుడు తమ ఇష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముంగమూరుకు మూడు చెరువుల నీళ్లు తాగించాలనే లక్ష్యంతోనే వివేకా నగరం నుంచి పోటీకి కాలుదువ్వేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకా పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్‌కుమార్ యాదవ్‌తో పొసగక పోవడంతో పీఆర్పీ నుంచి పోటీచేసిన ముంగమూరు విజయానికి పరోక్షంగా సహకరించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల తర్వాత ఐదేళ్లూ ఆనం, ముంగమూరు ఎంతో సఖ్యతతో ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట అనేలా వ్యవహరించారు. సిటీలో జరిగే అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివేకా హాజరయ్యేవారు. రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ముంగమూరు పాల్గొనే వారు. వివేకా అనారోగ్యం పాలైన సమయంలో సిటీలో జరిగిన అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముంగమూరుతో పాటు వివేకా కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ముంగమూరు ఆనం రాజకీయ వ్యతిరేకి ఆదాలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగితే ముంగమూరు ఆయనకు జైకొట్టారు. ఈ పరిణామాన్ని ఆనం సోదరులు జీర్ణించు కోలేకపోయారు. ఒక దశలో వివేకా ఈ విషయమై ముంగమూరును నిలదీశారనే ప్రచారం కూడా జరిగింది. ఆదాలతో కలసి ముంగమూరు తెలుగుదేశంలో చేరడానికి ఏర్పాట్లు చేసుకోవడం, సిటీ నుంచి టికెట్ కూడా ఖరారు చేయించుకోవడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన మదిలోని కోపాన్ని ఆయన ఎక్కడా బయట పెట్టకుండా ముందుకుపోతున్నారు. కార్పొరేషన్ పనులపై దృష్టి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబం కాంగ్రెస్ వైపే నిలబడి, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగాలని నిర్ణయించిన నేపథ్యంలో ముంగమూరు తమతోనే వస్తారని ఆనం సోదరులు ఆశించారు. అయితే ఆయన ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మారే ఆలోచనతో వున్న వివేకా గత ఎన్నికల్లో తాము ఎవరినైతే గెలిపించామో అతన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలకు వచ్చారని సమాచారం. ఇందులో భాగంగానే వివేకా నెల్లూరు సిటీ నుంచి పోటీచేయడానికి మానసింకగా సిద్ధపడినట్లు ఆయనే ప్రకటించారు. ఎన్నికల కోణంలోనే ఆయన కొర్పొరేషన్ పనుల మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులకు తమ మద్దతుదారులకు దక్కేలా చేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వివేకా కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుని ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ఎవరికి ఇవ్వాలో నిర్దేశించారని సమాచారం. నిన్నటి వరకు మిత్రులుగా కొనసాగిన వివేకా, ముంగమూరు ఎన్నికల వేడి పెరిగే కొద్దీ మరింత దూరం కానున్నారు. -
కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుండగా ఆ పార్టీని వీడేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు వీరి బాటలో పయనించే అవకాశముంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే అధిష్టానాన్ని ధిక్కరించారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి హైకమాండ్ కు సవాల్ విసిరారు. సీఎం జోక్యంతో కిరణ్ చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు. -
సమైక్య రన్ విజయవంతం
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు నిర్వహించిన సమైక్య రన్ విజయవంతమైంది. పార్టీలకతీతంగా పలువురు నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ రన్లో పాల్గొన్నారు. కళాకారులు నృత్యాలు, తప్పెట్లు తాళాలతో సమైక్య రన్ జీటీ రోడ్డు మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నగర ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభలో మూజువాణి ఓటుతో తిరస్కరించి పంపిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ విజ్ఞతతో విభజన బిల్లును నిలిపి వేయాలన్నారు. 1956లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని తెలిపారు. కోస్తా, రాయలసీమ ప్రజలకు మద్రాస్ మహానగరం దగ్గరగా ఉన్న ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. సీమాంధ్రులు కష్టించి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీమాంధ్రుల సత్తా చాటారు: సోమిరెడ్డి సీమాంధ్రులు ఉద్యమం ద్వారా తమ సత్తా చాటి చెప్పారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో విభజన బిల్లును తిరస్కరించి ఆం ధ్రుల ఐకమత్యాన్ని నిరూపించారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జగ్గారెడ్డి, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ తదితర నాయకులు సమైక్యాంధ్రనే కాంక్షిస్తున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు తరిమి కొడితే ఇక్కడకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఆంధ్రుల భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పజెప్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, విభజించడం ఎవరి తరం కాదన్నారు. సమైక్యాంధ్ర కోసం తండ్రి అడుగు జాడల్లో నడుస్తా : ఆనం జయకుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం 40 ఏళ్ల క్రితం అప్పటి నెల్లూరు ఎమ్మెల్యే, తన తండ్రి ఆనం వెంకటరెడ్డి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారని జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు ఆనం జయకుమార్‌రెడ్డి అన్నారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి సమైక్యాంధ్రను కాపాడుకోవడం కోసం తాను ఉద్య మం చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ చొప్పా రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు సాయిబాబా, రమణారెడ్డి, సుధాకర్‌రావు, సతీష్, శ్రీకాంతరావు, మంజు, కరుణమ్మ, స్వరూప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూల్ 6వ తరగతి విద్యార్థిని లాస్యప్రియ సమైక్యాంధ్ర గురించి చేసిన ప్రసంగం, బాలకృష్ణ ఆలపించిన సమైక్య గీతాలు సభలను అలరించాయి. -
లోక్‌సభకు మస్తాన్‌రావు?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి శాసనసభ్యుడు బీద మస్తాన్‌రావును ఈ సారి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఆయన పార్టీలోని కొందరు ముఖ్యులతో పాటు మస్తాన్‌రావుతో కూడా ఇటీవల చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అనేకమంది ఇతర పార్టీలకు వలస వెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆదాల ఈసారి సర్వేపల్లి నుంచి పోటీకి విముఖతతో వున్నట్లు సమాచారం. ఈ విషయం టీడీపీలోని తనకు సన్నిహితులైన పార్టీ ముఖ్యుల ద్వారా బాబుకు చేరవేసినట్లు తెలిసింది. అయితే టీడీపీలోని ఒక వర్గం ఆదాలను కావలి నుంచి పోటీ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. ఆదాల ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించి జిల్లా ముఖ్యులతో చర్చించినట్లు తెలి సింది. ఈ విషయం గురించి చంద్రబాబు నేరుగా కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుతో మాట్లాడారని తెలి సింది. ఆదాల కోసం తనను నె ల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని సూచించడం భావ్యం కాదని బీద తేల్చిచెప్పారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూడా తాను కావలి నుంచే పోటీ చేస్తాననీ, టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల గోదా నుంచి తప్పుకుంటానే తప్ప లోక్‌సభకు పోటీ చేసేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. దీంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి తర్వాత ఆలోచించాలని నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. -
23 తర్వాతే..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు సిటీ, సర్వేపల్లి శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు పార్టీ మార్చే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తెలుగుదేశంలోకి వెళ్తున్నట్టు ప్రచార సాధనాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ వారు ఎక్కడా ఖండించిన దాఖలాలు కూడా లేవు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇద్దరు ఎమ్మెల్యేల పునఃప్రవేశం గురించి అంతర్గత సంభాషణల్లో ఔననే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం శాసన సభ్యులిద్దరూ నగరంలోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా వారి మధ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టే విషయమై ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. తాము టీడీపీలోకి వెళ్లడం ఖాయమైనప్పటికీ జిల్లాలో కిరణ్ పార్టీలో ఎవరెవరు చేరుతారనే అంశంతో పాటు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. సంక్రాంతి పండగ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23వ తేదీ తరువాత పార్టీ మార్చే విషయంపై తమ నిర్ణయం వెల్లడిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో పాటు కొన్ని తేల్చుకోవాల్సిన అంశాలు కూడా ముడిపడి ఉన్నట్టు తెలిసింది. నెల్లూరు సిటీ తెలుగుదేశం టిక్కెట్టుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి రమేష్‌రెడ్డితో పాటు నగర పార్టీ కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముంగమూరుకు టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం వచ్చింది. అయితే నందమూరి బాలకృష్ణ నుంచి తనకు టిక్కెట్టుపై హామీ ఉందని కోటంరెడ్డి ప్రచారం చేస్తున్నారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి పార్టీ మారడానికి ముందుగానే టిక్కెట్టుపై హామీ కోరవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంగతిపై కూడా 23వ తేదీలోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా నెల్లూరు సిటీ టిక్కెట్టును మహిళలకు కేటాయించాలనే కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. నాలుగైదు రోజుల్లో ఈ డిమాండ్‌తో సిటీ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు చంద్రబాబును కలిసేందుకు రాజధానికి వెళ్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి శాసనసభకు పోటీ చేయాలా? నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలా ? అనే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తంగా నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మాత్రం అభ్యర్థులపై అయోమయం ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే ఈ నెల చివరివారం వరకు వేచిచూడక తప్పదు. -
నేత్రపర్వంగా భవానీల ఊరేగింపు
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: నగరంలోని దర్గామిట్టలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో ఇరుముడిధారణ చేశారు. వేదాయపాళెంలోని బాలయోగీశ్వరాశ్రమంలో గురుస్వామి వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఇరుముడి కట్టారు. ఆశ్రమంలో అమ్మవారి భజనలు చేశారు. రాత్రి వేదాయపాళెం నుంచి భవానీలందరూ అమ్మవారి కీర్తనలు పాడుతూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కలశాలు, ఇరుముడితో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆదివారం వేకువజామున జరిగిన మహాభిషేకంలో అమ్మవారిని ధ్యానించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు, ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, ముఖ్యఅర్చకుడు కుప్పచ్చి సుబ్బారావుస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంపై వెనక్కి తగ్గం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో 40వ రోజు ఆదివారం సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతంగా సాగింది. తిరుపతి ఎంపీ చింతా మోహన్ కనిపించలేదని వెంకటగిరిలో విద్యార్థి జేఏసీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ కళాశాలలో ఆదివారం ప్రజా సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలకు తపాలా ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. దుత్తలూరులో ఉపాధ్యాయులు, వింజమూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. గూడూరులో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో శాంతిహోమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి టవర్‌క్లాక్ సెంటర్లో రాస్తారోకో చేశారు.గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరులో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. కోట క్రాస్‌రోడ్డులో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అర్చకులు ర్యాలీ చేపట్టి శాంతిహోమం నిర్వహించారు. వాకాడులో భవన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అశోక్ స్తంభం కూడలిలో భవన కార్మిక సంఘర రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై రాతిగోడను కట్టి నిరసన తెలిపారు. పొదలకూరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తడలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మదర్సేవా సంస్థ కేంద్ర మంత్రులకు ఉత్తర క్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.