సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతం సాధించిన వైఎస్సార్ సీపీ జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తన సత్తా చాటింది. మాజీ మంత్రి ఆనంరామనారాయణరెడ్డిని తొలి ప్రయత్నంలోనే యువకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి మట్టి కరిపించి భారీ విజయం సొంత చేసుకున్నారు.
2009 ఎన్నికల్లో తనను ఓడించిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మీద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని మట్టి కరిపించి భారీ ఆధిక్యతతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని ఈసారి వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి మీద గెలుపొందారు. జిల్లాలో ఈ ఫలితాలను ఊహించలేక పోయిన టీడీపీ డీలా పడింది.
తొలిప్రయత్నంలోనే గౌతమ్ విజయం
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ దిగ్గజమైన ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ అభ్యర్థి గూటూరు కన్నబాబును ఈయన ఎదుర్కున్నారు. ప్రతి రౌండ్‌లోనూ భారీ ఆధిక్యత సాధిస్తూ 31,412 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సొంతం చేసుకున్నారు.
జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేల్లో ఇంత భారీ మెజారిటీ గౌతమ్‌రెడ్డికే దక్కింది. రాజకీయ ఆరంగేంట్రం చేసిన తొలి రోజు నుంచి ఆయన ఆత్మకూరులో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకోవడం, యువకుడిగా నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావడం ఆయన విజయానికి దోహదపడింది. గౌతమ్ దెబ్బకు ఆనంకు డిపాజిట్ గల్లంతైంది. నియోజకవర్గంలో ఇప్పటి దాకా ఎవరూ సొంతం చేసుకోని భారీ ఆధిక్యత ఆయన దక్కించుకున్నారు.
దెబ్బకు దెబ్బ
నెల్లూరు సిటీ నుంచి 2009లో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్‌లోని రాజకీయ కుట్రలతో అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత మూడున్నరేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్న ఆయన ఈ సారి అనూహ్యంగా శ్రీధర్ కృష్ణారెడ్డితోనే తలపడాల్సి వచ్చింది. శ్రీధర్ కృష్ణారెడి ్డ కాంగ్రెస్ నుంచి పార్టీ మారి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగినా ప్రయోజనం లేక పోయింది. అనిల్ కుమార్ ఈసారి తన ప్రత్యర్థి ముంగమూరును 19,820 ఓట్ల తేడాతో మట్టి కరిపించి రెండో ప్రయత్నంలో ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అనిల్ విజయం ముంగమూరుకు భారీ షాక్ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం చెంచుసుబ్బారెడ్డి 3971 ఓట్లు మాత్రమే సాధించుకున్నారు.
బీద కోటకు బీటలు
కావలిలో రెండో సారి గెలిచి తీరాలని టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్‌రావు శక్తికి మించి శ్రమించినా ఫలితం దక్కలేదు. 2009లో కావలి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్ రావు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ప్రతాప్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయంగా బలమైన వ్యక్తి అయితే బీద మస్తాన్‌రావు కోటను బద్ధలు కొట్టి ఆయన్ను ఓడించారు. నువ్వా? నేనా అనేలా సాగిన పోరులో ప్రతాప్‌కుమార్‌రెడ్డి 4971 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
తొలి ప్రయత్నంలోనే కోటంరెడ్డి ..
అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రయత్నించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిపోటీలోనే ఆ కోరిక నెరవేర్చుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవ ర్గం మీద గురిపెట్టిన ఆయన గత మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ నాయకుడిగా జనంలో ఉంటూ వచ్చారు. ఈ స్థానం టీడీపీ, బీజేపీ పొత్తులో బీజేపీకి దక్కడం కూడా కోటంరెడ్డికి లాభించి 25 వేల పైచిలుకు మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.
సంజీవయ్యకు ఊహించని అదృష్టం
హౌసింగ్ శాఖలో డీఈగా పనిచేస్తున్న కిలివేటి సంజీవయ్య ఊహించని విధంగా తొలి పోటీలోనే అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఏడాది కిందట ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం కంచుకోటైన సూళ్లూరుపేటలో ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసారత్నంను మట్టి కరిపించారు. అనూహ్యంగా ఆయన 3726 మెజారిటీతో గెలుపొందారు.
మున్సిపల్ చైర్మన్ నుంచి
ఎమ్మెల్యే దాకా సునీల్
గూడూరు మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన పాశం సునీల్ కుమార్ వైఎస్సార్ సీపీ తరపున తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక్కడ రాజకీయాలకు కొత్త అయిన డాక్టర్ జ్యోత్స్నను టీడీపీ బరిలోకి దించి చేసిన ప్రయోగం ఫలించలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో సునీల్ టీడీపీ కోటలు బద్ధలు కొట్టి 9088 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
బొల్లినేనికీ తొలిసారే
ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బొల్లినేని వెంకటరామరావు కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2012లో జరిగిన ఉదయగిరి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి కూడా అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్కంఠ భరితంగా నువ్వా? నేనా అనేలా సాగిన ఎన్నికల్లో ఆయన వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి మీద 4673 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
కాకాణికీ తొలిసారే
సర్వేపల్లి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాణి గోవర్ధనరెడ్డి టీడీపీలో కీలక నాయకుడైన సోమిరెడ్డిని ఓడించి మొదటి ప్రయత్నంలోనే గెలుపొంది తొలిసారి అసెం బ్లీలో అడుగుపెడుతున్నారు. విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన సోమిరెడ్డిని కాకాణి 5447 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా రు. మూడున్నరేళ్లుగా ఆయన జనంలోనే ఉంటూ రావడం విజయం వైపు నడిపించింది.
కురుగొండ్ల రెండో విజయం
వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణ వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందిన ఆయనకు ఈసారి టికెట్ రావడం అనుమానంగా కనిపించినప్పటికీ చంద్రబాబును ఎలాగోలా ప్రసన్నం చేసుకుని టి కెట్ సాధించుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కున్న ఆయన విజయం గురించి తీవ్ర ఆందోళన పడ్డారు. గెలుపెవరిదో అనేలా సాగిన కౌంటింగ్‌లో చివరకు ఆయన 5525 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పోలంరెడ్డి రెండోసారి
కోవూరులో 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 400 ఓట్ల పై చిలుకు మెజారిటీతో ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోలంరెడ్డి గెలిచారు. 2009 సార్వత్రిక, 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి కోవూరు అభ్యర్థిగా పోటీ చేసి 7942 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో సారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
ఫ్యాన్ దే హవా
Published Sat, May 17 2014 2:36 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
Advertisement
Advertisement