ముంగమూరుతోనే ఢీ
= నెల్లూరు నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న వివేకా
= ఆదాలతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేకే...
= శ్రీధర కృష్ణారెడ్డికి మూడు చెరువుల నీళ్లు తాగించాలని పట్టుదల
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ నేటి దాకా తన మిత్రుడైన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి మీద రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పోటీకి సై అంటున్నారు. 2009 ఎన్నికల్లో తమ సహకారంతో గెలుపొందిన ఆయన ఇప్పుడు తమ ఇష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముంగమూరుకు మూడు చెరువుల నీళ్లు తాగించాలనే లక్ష్యంతోనే వివేకా నగరం నుంచి పోటీకి కాలుదువ్వేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకా పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్‌కుమార్ యాదవ్‌తో పొసగక పోవడంతో పీఆర్పీ నుంచి పోటీచేసిన ముంగమూరు విజయానికి పరోక్షంగా సహకరించారు.
ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల తర్వాత ఐదేళ్లూ ఆనం, ముంగమూరు ఎంతో సఖ్యతతో ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట అనేలా వ్యవహరించారు. సిటీలో జరిగే అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివేకా హాజరయ్యేవారు. రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ముంగమూరు పాల్గొనే వారు. వివేకా అనారోగ్యం పాలైన సమయంలో సిటీలో జరిగిన అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముంగమూరుతో పాటు వివేకా కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ముంగమూరు ఆనం రాజకీయ వ్యతిరేకి ఆదాలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగితే ముంగమూరు ఆయనకు జైకొట్టారు. ఈ పరిణామాన్ని ఆనం సోదరులు జీర్ణించు కోలేకపోయారు. ఒక దశలో వివేకా ఈ విషయమై ముంగమూరును నిలదీశారనే ప్రచారం కూడా జరిగింది. ఆదాలతో కలసి ముంగమూరు తెలుగుదేశంలో చేరడానికి ఏర్పాట్లు చేసుకోవడం, సిటీ నుంచి టికెట్ కూడా ఖరారు చేయించుకోవడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన మదిలోని కోపాన్ని ఆయన ఎక్కడా బయట పెట్టకుండా ముందుకుపోతున్నారు.
కార్పొరేషన్ పనులపై దృష్టి
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబం కాంగ్రెస్ వైపే నిలబడి, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగాలని నిర్ణయించిన నేపథ్యంలో ముంగమూరు తమతోనే వస్తారని ఆనం సోదరులు ఆశించారు. అయితే ఆయన ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మారే ఆలోచనతో వున్న వివేకా గత ఎన్నికల్లో తాము ఎవరినైతే గెలిపించామో అతన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలకు వచ్చారని సమాచారం. ఇందులో భాగంగానే వివేకా నెల్లూరు సిటీ నుంచి పోటీచేయడానికి మానసింకగా సిద్ధపడినట్లు ఆయనే ప్రకటించారు. ఎన్నికల కోణంలోనే ఆయన కొర్పొరేషన్ పనుల మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులకు తమ మద్దతుదారులకు దక్కేలా చేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వివేకా కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుని ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ఎవరికి ఇవ్వాలో నిర్దేశించారని సమాచారం. నిన్నటి వరకు మిత్రులుగా కొనసాగిన వివేకా, ముంగమూరు ఎన్నికల వేడి పెరిగే కొద్దీ మరింత దూరం కానున్నారు.