సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి శాసనసభ్యుడు బీద మస్తాన్‌రావును ఈ సారి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఆయన పార్టీలోని కొందరు ముఖ్యులతో పాటు మస్తాన్‌రావుతో కూడా ఇటీవల చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అనేకమంది ఇతర పార్టీలకు వలస వెళుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆదాల ఈసారి సర్వేపల్లి నుంచి పోటీకి విముఖతతో వున్నట్లు సమాచారం. ఈ విషయం టీడీపీలోని తనకు సన్నిహితులైన పార్టీ ముఖ్యుల ద్వారా బాబుకు చేరవేసినట్లు తెలిసింది. అయితే టీడీపీలోని ఒక వర్గం ఆదాలను కావలి నుంచి పోటీ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. ఆదాల ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించి జిల్లా ముఖ్యులతో చర్చించినట్లు తెలి సింది.
ఈ విషయం గురించి చంద్రబాబు నేరుగా కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుతో మాట్లాడారని తెలి సింది. ఆదాల కోసం తనను నె ల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని సూచించడం భావ్యం కాదని బీద తేల్చిచెప్పారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూడా తాను కావలి నుంచే పోటీ చేస్తాననీ, టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల గోదా నుంచి తప్పుకుంటానే తప్ప లోక్‌సభకు పోటీ చేసేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. దీంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి తర్వాత ఆలోచించాలని నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
లోక్‌సభకు మస్తాన్‌రావు?
Published Sun, Jan 26 2014 3:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement