నగరంలోని దర్గామిట్టలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో ఇరుముడిధారణ చేశారు.
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: నగరంలోని దర్గామిట్టలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో ఇరుముడిధారణ చేశారు. వేదాయపాళెంలోని బాలయోగీశ్వరాశ్రమంలో గురుస్వామి వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఇరుముడి కట్టారు. ఆశ్రమంలో అమ్మవారి భజనలు చేశారు.
రాత్రి వేదాయపాళెం నుంచి భవానీలందరూ అమ్మవారి కీర్తనలు పాడుతూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కలశాలు, ఇరుముడితో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆదివారం వేకువజామున జరిగిన మహాభిషేకంలో అమ్మవారిని ధ్యానించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు, ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, ముఖ్యఅర్చకుడు కుప్పచ్చి సుబ్బారావుస్వామి, తదితరులు పాల్గొన్నారు.