ఆనం సోదరులకు ఎదురుదెబ్బ!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ తగలనుంది. ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. శనివారం వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలను కలసి ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు.
అనంతరం ఆనం విజయ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు తనకు నచ్చాయని, ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అనుచరులతో మాట్లాడి త్వరలో పార్టీలో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీలో చేరడం పట్ల విజయ్కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.