'ఆ 8 మంది గురించి మాట్లాడడం అనవసరం'
నెల్లూరు: ప్రతిపక్షం గొంతు నొక్కాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డికి పార్టీ కండువా వేసి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. అనైతిక రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగబోవని ఆయన అన్నారు. చంద్రబాబు మోసాలపై తమ పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
- ఎండను ఖాతరు చేయకుండా, ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో చికాకు కన్పించకుండా అప్యాయతను పంచిపెడుతున్న అందరికీ చేతులు జోడించి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను
- విజయన్నను మన పార్టీలో చేర్చుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది
- రాష్ట్ర ప్రజల మనోభావాలకు విజయన్న చేరిక అద్దం పడుతోంది
- మొన్న వెళ్లిపోయిన 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం అనవసరం
- ప్రతిపక్షమంటే ప్రజల గొంతు, మాట్లాడలేని ప్రజల గొంతు
- చంద్రబాబు మోసాలకు అవస్థలు పడుతున్న ప్రజల గొంతే ప్రతిపక్షం
- అలాంటి ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
- తన పార్టీ టికెట్ పై గెలవకపోయినా అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు
- రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజలు మన వైపు చూస్తారు
- రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉండాలి
- ఈ రెండు గుణాలు లేకుంటే ఇంట్లో పెళ్లాం కూడా మీ వెంట నడిచే పరిస్థితి ఉండదు
- అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు వ్యక్తిత్వం
- ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసగించడం చంద్రబాబు విశ్వసనీయత
- కొనుగోళ్లకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడం అనవసరం
- సోనియాతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టినా నేను భయపడలేదు
- దేవుడిని, ప్రజలను నమ్ముకుని ముందడుగు వేశాం
- 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో ఢిల్లీ మొత్తం మనవైపు చూసేలా చేశాం
- చంద్రబాబు తన పాలన మెరుగు పరుచుకోవాలి, ఇచ్చిన హామీలు అమలుచేయాలి
- ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే చంద్రబాబు అందరినీ మోసం చేశారు
- ఎన్నికలప్పుడు ఏ మాటలు చెప్పారో అవి నెరవేర్చాలి. కానీ చంద్రబాబు ప్రజలను, వారికి ఇచ్చిన మాటను గాలికి వదిలేశాడు
- నీచమైన రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు
- బ్రిటిష్ పాలకులు, హిట్లర్ లాంటివాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు
- ప్రజల కోపానికి బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు, చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు
- చంద్రబాబుతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మాకు కావాలి
- విజయన్నను సాదరంగా ఆహ్వానిస్తున్నా, మా కుటుంబ సభ్యుడిగా ఆయన ఉంటాడని గట్టిగా చెబుతున్నా