సాక్షి, నెల్లూరు: తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అమరావతి నుంచి నెల్లూరు చేరుకున్న చంద్రబాబు ఏసీ సెంటర్‌లోని ఆనం వివేకానందరెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు పుష్ఫాంజలి ఘటించారు. అనంరం వివేకా సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఆనం వివేకా అని కొనియాడారు. చరిత్రలో వివేకాకు ప్రత్యేక స్థానం ఉందని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని తెలిపారు. వివేకాకు సినిమాలంటే ఎంతో ఇష్టమని చంద్రబాబు తెలిపారు. మంత్రి పదవిని సైతం ప్రజలకోసం త్యాగం చేశారన్నారు. మనస్సుకు నచ్చిన విధంగా నడుచుకుంటూ, ఎవ్వరికీ భయపడని వ్యక్తి అన్నారు. వివేకా ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వివేకా ఇకలేరన్న సంగతి తెలుసుకున్న ప్రజలు, అభిమానులు ఆయన్ని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment