సాక్షి, నెల్లూరు : కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే అయిన కొత్తల్లో నగర వాసులు జోకులేసేవారు. పార్టీలు మారుతూ నెల్లూరు నగరాన్ని దోచుకున్న ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మళ్లీ నాటి కుట్రలకు పాల్పడటం నగర వాసులకు మింగుడు పడటంలేదు. నాడు ఆనం కుట్రలతో పీఆర్‌పీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆనం పంచన చేరారు. ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా ముంగమూరు నేడు టీడీపీ అభ్యర్థిగా అవతారమెత్తి మళ్లీ అవే కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ఆనం సోదరుల అండతో వైఎస్సార్‌సీపీని అడ్డుకునేందుకు వ్యూహరచన చేశారు. అయితే జనం ఇటు ఆనం, అటు ముంగమూరుకు ఒకేసారి రాజకీయ సమాధి కట్టేందుకు సర్వం సిద్ధం చేశారన్నది పరిశీలకుల అభిప్రాయం. నగర ఎమ్మెల్యేగా, రూరల్ ఎమ్మె ల్యే ఆనం వివేకానందరెడ్డితో చెట్టపట్టాలేసుకొని ఎక్కడబడితే అక్కడ అవినీతి డ్యూయట్లు పాడిన వీళ్లతంతు అందరికీ తెలిసిందే. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తుస్‌మంటుందని ముందే గ్రహించిన ముంగమూరు వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. మాటపై నిలబడే వైఎస్సార్‌సీపీ అధినేత తలుపులు మూసివేయడం తెలిసిందే.
దీంతో మళ్లీ అదే కుట్రతో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. పార్టీల మారినా మనిషి బుద్ధి మారదు అనడానికి ఉదాహరణ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి. పార్టీ ఏదైనా ఆనం సోదరులతో ఉండే అనుబంధాన్ని కొనసాగించడం, అధికారం కోసం కొంగజపాలు చేయడం అల వాటు. తన ప్రత్యర్థి ,వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనీల్‌కుమార్ యాదవ్‌ను ఇబ్బంది పెట్టేం దుకు మళ్లీ కుమ్మక్కు రాజకీయాలకు పూనుకున్నారు.
నగర రోడ్లకు రూ.300 కోట్లు?
ముంగమూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరంలో రూ.300 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. అవసరమున్న చోట రోడ్లు వేయకుండా, ఉన్న రోడ్లపైనే నాసిరకంగా వేసి కోట్లాది రూపాయలను ముంగమూరు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కార్పొరేషన్‌లో టెండర్ల వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత ముంగమూరుకే దక్కింది. కార్పొరేషన్‌లో మొత్తం 180 మందికిపైగా కాంట్రాక్టర్లు ఉండగా ముంగమూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేవలం ఆయన కుటుంబసభ్యులు మాత్రమే కాంట్రాక్టర్ల అవతారమెత్తి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని విమర్శలు లేకపోలేదు. ముంగమూరు పాలనలో నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారి నెల్లూ రు దోమల నగరంగా ప్రసిద్ధికెక్కింది.
ఆక్రమణల పర్వం
నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో ముంగమూరు అనుచరులు కోట్లాదిరూపాయల విలువైన స్థలాలను కబ్జా చేశారు. నచ్చనివారికి అనుమతులు ఇవ్వకపోవడమే కాకుండా ఆక్రమణల పేరుతో పలు ఇళ్లను, అపార్టుమెంట్లను కొల్లగొట్టిన ఘనత ముంగమూరుకే దక్కింది. ఇక రూరల్ పరిధిలో పెన్నానది సమీపంలో రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లే అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఆర్‌కే నగర్‌లో..
నగరంలోని ఆర్‌కే నగర్, గాండ్లవీధి ప్రాం తంలో 22 ఎకరాల దేవుని మాన్యం స్థలాన్ని కాజేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ముంగమూరు కుటుంబంపై ఉన్నాయి. బుజ్జమ్మతోట పేరుతో ఉన్న ఈ స్థలాన్ని ఆమె చనిపోతూ 1944లో రంగనాయకులస్వామి గుడికి బొమ్మిరెడ్డి సుబ్బరత్నమ్మ పేరున ఇచ్చారు.
ఆ తర్వాత చినస్వామినాయుడు అనే వ్యక్తి కౌలుకు చేస్తున్న ఈ భూమిని ముంగమూరు కుటుంబం వశం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత దాదాపు 22 ఎకరాల స్థలాన్ని ఆర్‌కేనగర్ గాండ్లవీధి ప్రాంతాన్ని ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇది దేవుని మాన్యం కావడంతో కొన్నవారికి పట్టాలు కాలేదు. ఇప్పటికీ పట్టాలు ఇస్తామని చెబుతూ ముంగమూరు కుటుంబం ఆ ప్రాంత ప్రజలను మభ్యపెడుతూనే ఉంది. ముంగమూరు ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా దాదాపు 1000 కుటుంబాలకు పట్టాలు దక్కలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
ముంగమూరు ఎమ్మెల్యే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1987లో స్థలాలు ఆక్రమించారంటూ దేవాదాయశాఖ ఆ ప్రాంత ప్రజలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముంగమూరుకు చేరవేసినా అదిగో.. ఇదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబు తున్నారని వారు ‘సాక్షి’తో వాపోయారు. దోమలమందు పంపిణీలో సైతం అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెలుపు కోసం అడ్డదారులు తొక్కేం దుకు వెనకాడని ముంగమూరుకు నగరవాసులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ముంగమూరు ‘ఛీ’ధర్
Published Wed, May 7 2014 2:50 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement