నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు నిర్వహించిన సమైక్య రన్ విజయవంతమైంది. పార్టీలకతీతంగా పలువురు నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ రన్‌లో పాల్గొన్నారు. కళాకారులు నృత్యాలు, తప్పెట్లు తాళాలతో సమైక్య రన్ జీటీ రోడ్డు మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు సాగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నగర ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభలో మూజువాణి ఓటుతో తిరస్కరించి పంపిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ విజ్ఞతతో విభజన బిల్లును నిలిపి వేయాలన్నారు. 1956లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని తెలిపారు. కోస్తా, రాయలసీమ ప్రజలకు మద్రాస్ మహానగరం దగ్గరగా ఉన్న ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. సీమాంధ్రులు కష్టించి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సీమాంధ్రుల సత్తా చాటారు: సోమిరెడ్డి
సీమాంధ్రులు ఉద్యమం ద్వారా తమ సత్తా చాటి చెప్పారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో విభజన బిల్లును తిరస్కరించి ఆం ధ్రుల ఐకమత్యాన్ని నిరూపించారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జగ్గారెడ్డి, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ తదితర నాయకులు సమైక్యాంధ్రనే కాంక్షిస్తున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు తరిమి కొడితే ఇక్కడకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఆంధ్రుల భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పజెప్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, విభజించడం ఎవరి తరం కాదన్నారు.
సమైక్యాంధ్ర కోసం తండ్రి అడుగు జాడల్లో నడుస్తా : ఆనం జయకుమార్‌రెడ్డి
సమైక్యాంధ్ర కోసం 40 ఏళ్ల క్రితం అప్పటి నెల్లూరు ఎమ్మెల్యే, తన తండ్రి ఆనం వెంకటరెడ్డి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారని జిల్లా ప్లానింగ్ కమిటీ మాజీ సభ్యుడు ఆనం జయకుమార్‌రెడ్డి అన్నారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి సమైక్యాంధ్రను కాపాడుకోవడం కోసం తాను ఉద్య మం చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ చొప్పా రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు సాయిబాబా, రమణారెడ్డి, సుధాకర్‌రావు, సతీష్, శ్రీకాంతరావు, మంజు, కరుణమ్మ, స్వరూప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూల్ 6వ తరగతి విద్యార్థిని లాస్యప్రియ సమైక్యాంధ్ర గురించి చేసిన ప్రసంగం, బాలకృష్ణ ఆలపించిన సమైక్య గీతాలు సభలను అలరించాయి.
సమైక్య రన్ విజయవంతం
Published Mon, Feb 10 2014 3:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement