రైతు గుండెల్లో లెహర్రర్
Published Tue, Nov 26 2013 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకృతి కన్నెర్రతో రైతన్న వణికిపోతున్నాడు. అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు చాలా నష్టపోయాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుస తుపాన్లు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు విరుచుకుపడిన తుఫాన్ల ధాటికి తట్టుకోలేక కుదేలయిన అన్నదాతలకు... మరోసారి తుఫాన్ రానుందన్న వార్త శరాఘాతమై తగులుతోంది. పై-లీన్, హెలెన్ తుఫాన్‌ల నుంచి ముప్పు తప్పినా గత నెలలో ఏర్పడిన అల్పపీడనం నిండా ముంచేసింది. అధిక వర్షాలతో ఉద్యాన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరి పంట ఇంటికి వస్తుం దన్న తరుణంలో తాజాగా లెహర్ తుఫాన్ విరుచుకుపడనుంద న్న సమాచారంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పార్వతీపురం డివిజన్‌లో చాలా చోట్ల వరి కోతలు పూర్తి అయ్యాయి. వరి పనలు ఇంకా కళ్లాల్లోనే ఉన్నాయి. ఇప్పు డు వర్షాలు పడితే తమగతమేం కానని వారు వాపోతున్నారు. విజయనగరం డివిజన్‌లో కోతలు ప్రారంభం కావలసి ఉంది.
అయితే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంటనుకోసేందుకు ఎవరూ సాహసించడంలేదు. కోతలు కోసేసిన తరువాత వర్షాలు పడితే పంట పూర్తిగా నాశనమవుతుందని, కోయకుండా ఉంటే కొంతవరకైనా రక్షించుకోవచ్చన చివరి ఆశలో రైతులున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలో రూ.323.4 కోట్ల మేర నష్టం సంభవించింది. వివిధ పంటలు 16,936 హెక్టార్లలో, ఉద్యాన పంట లు 1197.37 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 82 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటకు నష్టం కలిగింది. 2,655 ఇళ్లు కూలిపోయాయి. హెలెన్ కన్నా లెహర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించడంతో ఏమవుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పూరి ళ్లు, లోతట్టు ప్రాంతాల వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు పడేటప్పుడు బయట తిరగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌లు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ సారి ఎన్‌ఆర్‌డీఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ,
నేవీ, కోస్ట్ గార్డులను సైతం సాయంకోసం అందుబాటులో ఉంచారు.
మత్స్యకారులూ... వేటకు వెళ్లొద్దు..
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పంటలు కోసే ముందు వాతావరణాన్ని చూసుకోవాలని వారు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరు 1077 కొనసాగిస్తున్నారు. తీరప్రాంతాలకు ప్రత్యేకాధికారులను సైతం నియమించారు. ఈనెల 28న తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement