సాక్షి ప్రతినిధి, విజయనగరం : భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేకుండా జిల్లాలో నిర్మించిన భవనాలను లైన్ క్లియర్ కానుంది. ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశాన్ని కల్పించింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని అమలు చేశారు. 2007 డిసెంబర్ 15వరకు భవన క్రమబద్ధీకరణ అమలులో ఉంది. అప్పట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో 2,552 భవనాల్ని క్రమబద్ధీకరించారు. ప్రభుత్వానికి దాదాపు రూ. 6.23కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అంతకు రెట్టింపు ఆదాయం రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చివరిగా జరిగిన భవన క్రమబద్ధీకరణలో విజయనగరం మున్సిపాల్టీ పరిధిలో 2,774 దరఖాస్తులు రాగా, 1,795 దరఖాస్తుల్ని అధికారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ. 5కోట్ల 15వేల ఆదాయం వచ్చింది. బొబ్బిలి మున్సిపాల్టీ పరిధిలో 324 దరఖాస్తులు రాగా, 284 పరిష్కరించారు. వీటి ద్వారా రూ.38.18లక్షల ఆదాయం వచ్చింది. పార్వతీపురం మున్సిపాల్టీలో 964దరఖాస్తులు రాగా, 243పరిష్కరించడంతో రూ.62.10లక్షల ఆదాయం సమకూరింది. సాలూరు మున్సిపాల్టీలో 512దరఖాస్తులు రాగా, 230 పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ.23.10 లక్షల ఆదాయం లభించింది. చివరిగా భవన క్రమబద్ధీకరణ జరిగి ఏడేళ్లు దాటడంతో ఈసారి అంతకుమించి ఆదాయం లభించే అవకాశం ఉంది. దాదాపు ప్రతీ మున్సిపాల్టీలో అక్రమ కట్టడాల సంఖ్య వందల్లోనే ఉంది.
అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వాటి లెక్క తేలడం లేదు. అలాంటి భవనాల క్రమబద్ధీకరణ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో అక్రమ కట్టడదారులంతా ముందుకొచ్చి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంది. భూమి, భవనాల విలువ భారీగా పెరగడంతో తప్పనిసరిగా క్రమబద్ధీకరణకు యజమానులు ఆసక్తి చూపుతారు. ఈలెక్కన మున్సిపాల్టీల్లో ఈసారి భవన క్రమబద్ధీకరణ ఆదాయం రూ.13 నుంచి 15 కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వారు, తీసుకున్న ప్లాన్ కన్నా అదనపు నిర్మాణాలు చేపట్టిన వారంతా భవన క్రమబద్ధీకరణలోకి వస్తారు. వీరంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అధికారులు క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, పంచాయతీల్లో కూడా భవన క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. అయితే వీటిలో అనధికార కట్టడాల్ని అంచనా వేయడం కష్టం.
ఏడేళ్ల తరువాత మరో ఛాన్స్ !
Published Tue, Feb 3 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement