♦ టీడీపీలో మొదలైన సంస్థాగత సందడి
♦ మండల కమిటీల తర్వాతే జిల్లా కమిటీ
♦ జిల్లా, అర్బన్ పీఠాల కోసం పావులు కదుపుతున్న ఇరువర్గాలు
♦ అధ్యక్ష పీఠం కోసం ఆసక్తి చూపని ఎమ్మెల్యేలు
♦ మళ్లీ రచ్చకెక్కనున్న వర్గపోరు
‘అధ్యక్ష’ పదవులే లక్ష్యంగా టీడీపీలో వర్గపోరు సాగుతోంది. సంస్థాగత ఎన్నికలు ఇందుకు వేదిక అవుతున్నాయి. పార్టీలో పట్టుకోసం జిల్లాలోని ఇరువర్గాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మండల కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు జిల్లా, అర్బన్ అధ్యక్ష పీఠాలపైనే గురిపెట్టాయి. అధినేత అందరి సమక్షంలో క్లాసు పీకినా..ఆధిపత్యం కోసం ఇరువర్గాలు కత్తులు నూరుతునే ఉన్నాయి.
సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలుత మండల, ఏరియా, డివిజన్ కమిటీల నియామకం పూర్తి కాగానే విశాఖ నగర, రూరల్ జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశం హాట్‌టాపిక్ అయింది. పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయ్ అంటూ పార్టీ అధినేత వారిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అధినేత మందలించినంత మాత్రాన వీరిలో మార్పు వస్తుందను కుంటే పొరపాటేనని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు వీరి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోయనున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. కాగా జిల్లా, అర్బన్ అధ్యక్షుల మార్పు తప్పదని పార్టీ అధినేత సంకేతాలివ్వడంతో ఈ రెండు కీలక పదవులను తమవారికి కట్టబెట్టడం ద్వారా పార్టీలో పైచేయి సాధించాలని గంటా,అయ్యన్న వర్గాలు పావులు కదువుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడు మంత్రి అయ్యన్నకు ప్రధాన అనుచరుడు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో గవిరెడ్డికి మంత్రి గంటాకు దూరం బాగా పెరిగింది. దీంతో గవిరెడ్డి స్థానంలో తన అనుచరుడు జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని భర్త భాస్కర్‌ను నిలబెట్టాలని మంత్రి గంటా పావులు కదుపుతున్నారు. గవిరెడ్డినే కొనసాగించాలని మంత్రి అయ్యన్న పట్టుబడుతున్నారు.
గడిచిన ఎన్నికల్లో యలమంచిలి సీటును ఆశించి భంగపడిన సుందర విజయ్‌కుమార్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బంటుమిల్లి మణిశంకర నాయుడులు కూడా జిల్లా పార్టీ పదవి రేసులో ఉన్నారు. వీరిలో పాటు మాజీ మంత్రి అప్పలనరసింహరాజు, చోడవరం సుగర్‌స చైర్మన్ గూనూరు మల్లునాయుడు కూడా ఈ పదవిపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షునిగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈయనపై కూడా మంత్రి గంటా వర్గీయునిగా ముద్రపడింది. వాసుపల్లి మార్పు కూడా తప్పదని తెలుస్తోంది.
అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం టీడీపీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన వుడా మాజీ చైర్మన్ ఎస్‌ఏ రెహ్మాన్‌తో పాటు జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ పట్టాభిరామ్, జహీర్ అహ్మద్, ఒమ్మి సన్యాసిరావు, కోన తాతారావు, పైలా ముత్యాలనాయుడు, హర్షవర్దన్ ప్రసాద్ తదితరులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఒక్క పల్లా శ్రీనివాసరావు మాత్రమే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు అర్బన్‌తో పాటు అటు జిల్లా పార్టీపై కూడా మరింత పట్టు సాధించేందుకు గంటా, అయ్యన్న వర్గాలు పావులు కదుపుతున్నాయి.
మండల కమిటీల తర్వాతే
పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి శనివారం మొదలైంది. ఇప్పటికే పంచాయతీ స్థాయిలో వార్డు, గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ ఇప్పుడు మండల కమిటీలపై దృష్టి పెట్టింది. జీవీఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఏరియా, డివిజన్/వార్డు అధ్యక్ష ఎన్నికలకు తెరలేచింది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకంగా ఎన్నికల పరిశీలకులను కూడా నియమించింది. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న జీవీఎంసీపై పట్టు సాధించేందుకు డివిజన్ కమిటీలపై ఆధిపత్యం కోసం విశాఖ పరిధిలో తమ అనుచర ఎమ్మెల్యేల ద్వారా పట్టు సాధించేందుకు గంటా, అయ్యన్నలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అధ్యక్ష పదవులే లక్ష్యం
Published Mon, Apr 13 2015 2:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement