సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 30వ తేదీ తరువాత నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ తరువాత పదవీవిరమణ చేయబోయేవారికే ఈ పెంపును వర్తింపచేయాలన్న అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సచివాలయంలో తెలిపారు. రిటైర్మెంట్ వయసును పెంచుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసినా దానిపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల శాశ్వత పంపిణీలో సమస్యలు ఎదురవుతుండడంతో వాటన్నిటినీ సర్దుబాటు చేసుకున్నాకే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత విధివిధానాలను ఖరారు చేసి ఆర్డినెన్స్ తేనున్నారు.