కొండల్లో కోయిల పాటై...భావిపౌరులకు బంగారు బాటై..భద్రాద్రిలో కళారూపమై..విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంలో ఏటేటా ప్రవర్దమానమై...భరతనాట్యమై..కూచిపూడియై... రేల నృత్యమై...క్విజ్‌లో ప్రతిభను చాటుతూ...అడవి బిడ్డలకు అందమైన ఫ్యాన్సీ డ్రెస్ చూయిస్తూ...ముగ్గులతో రంగవల్లులు అద్దుకునే భద్రాద్రి ‘భళా’ఉత్సవ్...రానే వస్తోంది. మూడేళ్లుగా జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న బాలోత్సవ్ పోటీలను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయత్తం అవుతున్నారు.
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు భద్రాద్రి బాలోత్సవ్ దోహదపడుతోంది. విద్యార్థుల అంతర్గత శక్తిని వెలికితీసేందుకు ఇది ఉపయోగపడుతోంది. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా బాలోత్సవ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారిలో సృజనాత్మకతకు వెలుగులోకి వస్తుందని...ఇది వారి భావిజీవితానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. రెండురోజుల పాటు స్వేచ్ఛావాతావరణం, స్వీయ అనుభవాలతో ఇక్కడ నేర్చుకునే పాఠాలు కొన్ని నెలలపాటు తరగతి గదుల్లో తెలుసుకున్నా బోధపడవని అంటున్నారు.
ఒకరి ఆలోచనకు మరొకరి ఆచరణ పునాదిగా ‘భద్రాద్రి బాలోత్సవ్’ ఆవిర్భవించింది. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే వారు భవిష్యత్‌లో సమగ్ర వికాసం చెందుతారనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు దీనికి ఆలోచన చేశారు. డబ్బు ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదని, నలుగురికి నాలుగు విధాలుగా సహాయపడినప్పుడు వచ్చే కీర్తి మాత్రమే శాశ్వతం అని తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య నమ్మేవారు.
ఆ విశ్వాసం కొద్దీ ఆయన బాలోత్సవ్‌కు శ్రీకారం చుట్టారు. 2010లో తొలిసారి ఈ భద్రాద్రి బాలోత్సవ్‌ను నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలో చదువుతున్న 6-14 సంవత్సరాలలోపు పిల్లలను నిర్వాహకులు ఆహ్వానించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి అపూర్వస్పందన రావడంతో అదే ఉత్సాహంతో 2011లోనూ నిర్వహించారు. అనుకోని అవాంతరాల వల్ల 2012లో భద్రాద్రి బాలోత్సవ్‌ను నిర్వహించలేదు. 2013లో వీరికి ఐటీసీ పీఎస్‌పీడీ, ఖమ్మం జిల్లా గాంధీపథంలు కూడా తోడవడంతో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో బాలోత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సమస్త కళలకు వేదికగా భద్రాద్రి : ఈ బాలోత్సవ్ విద్యార్థుల ఉత్సాహానికి, ఉల్లాసానికి, ఆనందానికి వేదికగా నిలుస్తోంది. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ ఆదివాసీ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, కథా రచనలు, వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్ షో,గిరిజన సంప్రదాయ నృ త్యాలు, భరతనాట్యం, కూచి పూడి, స్పాట్ డ్రాయింగ్, ముగ్గుల పోటీలు, ఆటలు, పాటల పోటీలు ఇలా... సమస్త కళలలో విద్యార్థులు పాల్గొనేలా పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులనూ ఈ ఉత్సవాలు ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలు బహుమతులు సాధించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. ఇప్పటికే 2013 బాలోత్సవ్ సందడి ప్రారంభమైంది. ఈ భద్రాద్రి బాలోత్సవ్ ఏటేటా ప్రవర్ధమానమై...జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదగాలని ఆశిద్దాం.
రేపటిపౌరులు సమాజస్థాపనకు పునాదిరాళ్లవ్వాలని..
విద్యతోపాటు వివిధ రంగాల్లో రేపటి పౌరులు రాణించాలని...మంచి సమాజ స్థాపనకు పునాదిరాళ్లుగా మారాలనే ఉద్దేశంతో భద్రాద్రి బాలోత్సవ్‌ను ప్రారంభించాం. ఈ ఉత్సవ్ ద్వారా విద్యార్థులు తమశక్తిని తాము తెలుసుకొని సమాజానికి ఉపయోగపడేలా తయారవ్వాలనే నా అభిమతం.
- తాళ్లూరి పంచాక్షరయ్య, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా..
బాలోత్సవ్‌లో ఆటపాటలతో పాటు పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మార్గదర్శకాలపై తొలిసారి ఈ ఏడాది పోటీల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాం. అలాగే పర్యావరణం- ప్లాస్లిక్‌భూతంపై చర్చాగోష్ట్ఠి కార్యక్రమాలు రూపొందించాం. ఈ బాలోత్సవ్ విజయవంతం అవడానికి పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు...సహాయసహకారాలు అందిస్తున్నందుకు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు.
- బెక్కంటి శ్రీనివాసరావు,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బాలోత్సవ్ కన్వీనర్
ఏజెన్సీకి వన్నె తెస్తున్న భద్రాద్రి బాలోత్సవ్
Published Sun, Aug 25 2013 4:43 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement