సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో నాలుగైదు వేల పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుందనే ఒకే ఒక్క కబురు అనేకమంది విద్యాధికుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. డిగ్రీ పూర్తి చేశాక బీఈడీ చేయలేని విద్యార్థుల్లో వెయ్యి మంది ఇలాగైనా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సులో చేరాలని తపించారు.
సరిగ్గా వారి ఆలోచనలను సొమ్ము చేసుకునేందుకు పథకం వేసిన ఏజెంట్లతో జిల్లాలోని పలు ప్రభుత్వ పీఈటీలు అవగాహన కుదుర్చుకున్నారు. ఇలా ఏజెంట్లు, పీఈటీలు ప్రణాళిక రచించారు. ఆ ప్రకారం వెయ్యి మందిని బుట్టలో వేసుకున్నారు.
ఇదీ ఒప్పందం...తర్వాత ఆగమాగం!
బీహార్‌లో పరీక్షలు రాయిస్తామని, 40 రోజుల్లో సర్టిఫికెట్లు వస్తాయని నమ్మబలికారు కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ఏజెంట్లు. దీంతో సిద్దిపేట సహా జిల్లాలోని యువతీ యువకులు ముందుకొచ్చారు. విధి విధానాలపై మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫీజు గరిష్టంగా రూ.45 వేలుగా చెప్పడంతో ఇచ్చేశారు. ఈ ప్రక్రియ 2012 ద్వితీయార్థంలో షురువైంది. అదే ఏడాది జూన్‌లో అభ్యర్థులను బీహార్‌కు తీసుకెళ్లగా అక్కడ వివాదాలు జరగడంతో పరీక్షలు రాయించకుండానే వెనక్కు పంపారు.
ఆగమాగమవడమే కాకుండా రూ.10 వేల దాకా వృథా ఖర్చులను అభ్యర్థులు భరించారు. మళ్లీ తాజాగా ఈ నెల 8 ఢిల్లీకి సమీపంలోని మీరట్‌కు పిలిచారు. అక్కడ యూజీసీ పరిధిలోని ఆయా కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు సంసిద్ధులయ్యారు. 16 రోజులపాటు నానా తంటాలతో రోజుకు రూ.400 లాడ్జికి వెచ్చించి...ఎట్టకేలకు అక్కడ పరీక్షలు రాసి గమ్యానికి బృందాలుగా సోమవారం నుంచి తిరుగుముఖం పడుతున్నారు అభ్యర్థులు.
వ్యయం చిట్టా ఇదీ...
మొదట సగటున రూ.45 వేల వరకు ఫీజుల రూపంలో అభ్యర్థులు చెల్లించారు. తీరా పరీక్షలు రాసే వేళకి ప్రాక్టికల్స్ కోసం అదనంగా రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేది లేక అడిగినంతా ముట్టజెప్పారు. రూ.50 వేలు ఇలా వ్యయమైపోగా, అంతకుముందే విడతల వారీగా ఏజెంట్లు...తెర వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పి...తమకు ఖర్చులుంటాయంటూ మొత్తంగా రూ.30 వేల దాకా పిండారు. ఇలా ఇంచుమించు రూ.80 వేలు రాబట్టారు. ఇంతగా ఆర్థిక భారాన్ని భరించి...నెలల తరబడి అనేక ప్రయాసలపాలైన తమకు సకాలంలో సర్టిఫికెట్లు అందాలని అభ్యర్థులు ఉబలాటపడుతున్నారు. ఈ తరహా అభ్యర్థులకు కొలువులు ఎప్పుడు దక్కుతాయో ఎందరికి ఆ భాగ్యం సొంతమవుతుందో కానీ...మొత్తానికైతే ఏజెంట్లు, కొందరు పీఈటీలకు మాత్రం రూ.3.50 కోట్ల దాకా కాసుల పంట పండింది!
నిరుద్యోగులతో చెలగాటం
Published Tue, Dec 24 2013 11:36 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement