Bachelor of Physical Education
-
పీఈసెట్‌లో బాలికలే టాప్
- బీపీఈడీ టాప్ టెన్‌లో ఆరుగురు..డీపీఈడీ టాప్ 10లో ఏడుగురు వారే - బీపీఈడీలో 97.13%,డీపీఈడీలో 97.62% ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీఈసెట్)లో బాలికలు సత్తాచాటారు. బీపీఈడీలో టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు బాలికలు కాగా నలుగురే బాలురు. డీపీఈడీలో ఏడుగురు బాలికలు ఉండగా ముగ్గురే బాలురు ఉన్నారు. ఇక టాపర్లలో ఎక్కువ మంది ఖమ్మం జిల్లా నుంచి ఉండటం విశేషం. 12 రోజుల పాటు(బాలురకు 10 రోజులు, బాలికలకు 2 రోజులు) నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియెన్సీ, స్కిల్ టెస్టులను గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఈ నెల 6 నుంచి 17 వరకు నిర్వహించారు. ఈ ఫలితాలను బుధవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ్టటఞ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్-2 మినహా ఈ పరీక్ష ఫలితాలతో దాదాపు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాల వెల్లడి పూర్తయిందన్నారు. వచ్చే నెల 2 నుంచి ఎడ్‌సెట్ ప్రవేశాలు ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే ఎంసెట్ ప్రవేశాలు కూడా మొదలు పెడతామన్నారు. ఈ నెలాఖరులోగా కాలేజీల అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారు అవుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు చేపడుతున్నాయన్న అంశంపై స్పందిస్తూ ఏయే కాలేజీకి అనుబంధ గుర్తింపు వస్తుందో రాదో ఇప్పుడే తెలియదని, అలాంటప్పుడు మేనేజ్మెంట్ కోటాలో చేరవద్దని విద్యార్థులకు సూచించారు. ఉత్తీర్ణత వివరాలు: బీపీఈడీలో చేరేందుకు మొత్తం 3,564 మంది దరఖాస్తు చేసుకోగా 2,547 మంది పరీక్ష కు హాజరయ్యారు. అందులో 2,474 మంది(97.13 %) ఉత్తీర్ణులయ్యారు. డీపీఈడీలో చేరేందుకు 4,344 మంది దరఖాస్తు చేసుకోగా 3,276 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,198 మంది (97.62%) ఉత్తీర్ణులయ్యారు. -
నిరుద్యోగులతో చెలగాటం
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో నాలుగైదు వేల పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుందనే ఒకే ఒక్క కబురు అనేకమంది విద్యాధికుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. డిగ్రీ పూర్తి చేశాక బీఈడీ చేయలేని విద్యార్థుల్లో వెయ్యి మంది ఇలాగైనా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సులో చేరాలని తపించారు. సరిగ్గా వారి ఆలోచనలను సొమ్ము చేసుకునేందుకు పథకం వేసిన ఏజెంట్లతో జిల్లాలోని పలు ప్రభుత్వ పీఈటీలు అవగాహన కుదుర్చుకున్నారు. ఇలా ఏజెంట్లు, పీఈటీలు ప్రణాళిక రచించారు. ఆ ప్రకారం వెయ్యి మందిని బుట్టలో వేసుకున్నారు. ఇదీ ఒప్పందం...తర్వాత ఆగమాగం! బీహార్‌లో పరీక్షలు రాయిస్తామని, 40 రోజుల్లో సర్టిఫికెట్లు వస్తాయని నమ్మబలికారు కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ఏజెంట్లు. దీంతో సిద్దిపేట సహా జిల్లాలోని యువతీ యువకులు ముందుకొచ్చారు. విధి విధానాలపై మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫీజు గరిష్టంగా రూ.45 వేలుగా చెప్పడంతో ఇచ్చేశారు. ఈ ప్రక్రియ 2012 ద్వితీయార్థంలో షురువైంది. అదే ఏడాది జూన్‌లో అభ్యర్థులను బీహార్‌కు తీసుకెళ్లగా అక్కడ వివాదాలు జరగడంతో పరీక్షలు రాయించకుండానే వెనక్కు పంపారు. ఆగమాగమవడమే కాకుండా రూ.10 వేల దాకా వృథా ఖర్చులను అభ్యర్థులు భరించారు. మళ్లీ తాజాగా ఈ నెల 8 ఢిల్లీకి సమీపంలోని మీరట్‌కు పిలిచారు. అక్కడ యూజీసీ పరిధిలోని ఆయా కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు సంసిద్ధులయ్యారు. 16 రోజులపాటు నానా తంటాలతో రోజుకు రూ.400 లాడ్జికి వెచ్చించి...ఎట్టకేలకు అక్కడ పరీక్షలు రాసి గమ్యానికి బృందాలుగా సోమవారం నుంచి తిరుగుముఖం పడుతున్నారు అభ్యర్థులు. వ్యయం చిట్టా ఇదీ... మొదట సగటున రూ.45 వేల వరకు ఫీజుల రూపంలో అభ్యర్థులు చెల్లించారు. తీరా పరీక్షలు రాసే వేళకి ప్రాక్టికల్స్ కోసం అదనంగా రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేది లేక అడిగినంతా ముట్టజెప్పారు. రూ.50 వేలు ఇలా వ్యయమైపోగా, అంతకుముందే విడతల వారీగా ఏజెంట్లు...తెర వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పి...తమకు ఖర్చులుంటాయంటూ మొత్తంగా రూ.30 వేల దాకా పిండారు. ఇలా ఇంచుమించు రూ.80 వేలు రాబట్టారు. ఇంతగా ఆర్థిక భారాన్ని భరించి...నెలల తరబడి అనేక ప్రయాసలపాలైన తమకు సకాలంలో సర్టిఫికెట్లు అందాలని అభ్యర్థులు ఉబలాటపడుతున్నారు. ఈ తరహా అభ్యర్థులకు కొలువులు ఎప్పుడు దక్కుతాయో ఎందరికి ఆ భాగ్యం సొంతమవుతుందో కానీ...మొత్తానికైతే ఏజెంట్లు, కొందరు పీఈటీలకు మాత్రం రూ.3.50 కోట్ల దాకా కాసుల పంట పండింది! -
ఖమ్మంలో బీపీఈడీ కళాశాల
కొత్తగూడెం, న్యూస్‌లైన్: వచ్చే ఏడాదిలోగా ఖమ్మంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడీ) కళాశాల ఏర్పాటవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వెంకటరత్నం తెలిపారు. దీనికి కావాల్సిన అనుమతులు లభించాయన్నారు. మూడురోజుల పాటు కొత్తగూడెంలో జరిగిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీల ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సింగరేణి మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. గతంలో భద్రాచలంలో బీపీఈడీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నించామన్నారు. ఏజెన్సీ నిబంధనల కారణంగా అనుమతి లభించలేదన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న బీపీఈడీ కళాశాలకు మాత్రం ఇప్పటికే అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. భద్రాచలంలో ఏర్పాటు చేయాల్సిన బీపీఈడీ కళాశాలను కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను స్వయంగా క్రీడాకారుడిని కావడం వల్ల చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నానన్నారు. ఎంత ఖర్చు చేసినా ఇప్పటి వరకు జాతీయస్థాయిలో కాకతీయ యూనివర్సిటీకి పతకాలు రాకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. దీనిని అధిగమించేందుకు క్రీడాకారులు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా జాతీయ పోటీలకు వెళ్లిన టీమ్ తెల్లారేసరికి తిరిగి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా మార్కులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీగా కేయూ ఉందని, కేయూ పరిధిలోని మూడు జిల్లాలు కోల్‌బెల్ట్ ప్రాంతానికే చెందినవి కావడం గమనార్హం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ తోడ్పాటునందించాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలోని భద్రాచలం రీజియన్పైనే తనకు ఎక్కువగా నమ్మకం ఉందని, అత్యుత్తమ ఫలితాలు ఈ ప్రాంతం నుంచే వస్తాయని వివరించారు. శరీరం, మేథస్సుకు సమాన ప్రాధాన్యత కల్పించినవారే జీవితంలో రాణించగలుగుతారని పేర్కన్నారు. విద్యార్థులు కూడా ఈ విషయంపై దృష్టి సారించి చదువులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కప్పగంతుల్లో నా మొదటి బహుమతి... క్రీడాకారుడిగా తన చిన్ననాటి అనుభవాలను వీసీ గుర్తుచేసుకున్నారు. తాను మూడో తరగతి చదవే రోజుల్లో కప్పగంతుల్లో మొదటి బహుమతి వచ్చిందన్నారు. ఆ స్ఫూర్తితో క్రీడలపై మక్కువ పెంచుకుని.. ఇదే క్రీడాంశంలో డిగ్రీ చదివే రోజుల్లో యూనివర్సిటీ స్థాయిలో మొదటి బహుమతి సాధించానన్నారు. ‘నేను గెలిచిన ప్రతిసారీ బహుమతులు తీసుకునే సమయంలో నేను ఎప్పుడు ఇలా బహుమతులు ఇచ్చేవాడినవుతానా అని కలలు కనేవాడిని..ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం వల్ల వీసీ స్థాయికి చేరాను’ అని వివరించారు. సింగరేణి సంస్థలో తాను ఇటీవలికాలంలో ఉద్యోగుల ఆరోగ్యంపై సర్వే నిర్వహించానని సింగరేణి డెరైక్టర్ ‘పా’ టి.విజయ్‌కుమార్ తెలిపారు. ఎక్కువ మంది బీపీ, షుగర్లతో బాధ పడుతున్నారని బయటపడిందన్నారు. వీటి నుంచి బయటపడేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. తమ సంస్థ మొదటినుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ సంస్థల వలే జాతీయ క్రీడాకారులను స్పాన్సర్ చేస్తామన్నారు. విద్యార్థులు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ డెరైక్టర్ ఎస్.రాధాకృష్ణ, సింగరేణి జీఎం (ఎడ్యుకేషన్) వై.వెంకటేశ్వర్లు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.కమలారాణి, ఫిజికల్ డెరైక్టర్ డాక్టర్ కె.సావిత్రి పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ సింగరేణి కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడాపోటీల్లో సింగరేణి మహిళా కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. మొత్తం తొమ్మిది ఈవెంట్స్‌లో ఈ కళాశాలకు చెందిన 35 మంది క్రీడాకారిణులు యూనివర్సిటీ క్రీడలకు ఎంపికయ్యారు. కేయూ యూనివర్సిటీ స్థాయిలో మహిళా క్రీడా పోటీలు ప్రారంభమై ఏడేళ్లవుతుంది. ఈ ఏడేళ్ల నుంచి సింగరేణి మహిళా కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధిస్తుండటం గమనార్హం.