పీఈసెట్‌లో బాలికలే టాప్
- బీపీఈడీ టాప్ టెన్‌లో ఆరుగురు..డీపీఈడీ టాప్ 10లో ఏడుగురు వారే
- బీపీఈడీలో 97.13%,డీపీఈడీలో 97.62% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీఈసెట్)లో బాలికలు సత్తాచాటారు. బీపీఈడీలో టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు బాలికలు కాగా నలుగురే బాలురు. డీపీఈడీలో ఏడుగురు బాలికలు ఉండగా ముగ్గురే బాలురు ఉన్నారు. ఇక టాపర్లలో ఎక్కువ మంది ఖమ్మం జిల్లా నుంచి ఉండటం విశేషం. 12 రోజుల పాటు(బాలురకు 10 రోజులు, బాలికలకు 2 రోజులు) నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియెన్సీ, స్కిల్ టెస్టులను గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఈ నెల 6 నుంచి 17 వరకు నిర్వహించారు. ఈ ఫలితాలను బుధవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.
విద్యార్థులు ్టటఞ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్-2 మినహా ఈ పరీక్ష ఫలితాలతో దాదాపు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాల వెల్లడి పూర్తయిందన్నారు. వచ్చే నెల 2 నుంచి ఎడ్‌సెట్ ప్రవేశాలు ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే ఎంసెట్ ప్రవేశాలు కూడా మొదలు పెడతామన్నారు. ఈ నెలాఖరులోగా కాలేజీల అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారు అవుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలు మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలు చేపడుతున్నాయన్న అంశంపై స్పందిస్తూ ఏయే కాలేజీకి అనుబంధ గుర్తింపు వస్తుందో రాదో ఇప్పుడే తెలియదని, అలాంటప్పుడు మేనేజ్‌మెంట్ కోటాలో చేరవద్దని విద్యార్థులకు సూచించారు.
ఉత్తీర్ణత వివరాలు: బీపీఈడీలో చేరేందుకు మొత్తం 3,564 మంది దరఖాస్తు చేసుకోగా 2,547 మంది పరీక్ష కు హాజరయ్యారు. అందులో 2,474 మంది(97.13 %) ఉత్తీర్ణులయ్యారు. డీపీఈడీలో చేరేందుకు 4,344 మంది దరఖాస్తు చేసుకోగా 3,276 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,198 మంది (97.62%) ఉత్తీర్ణులయ్యారు.