ఖమ్మంలో బీపీఈడీ కళాశాల
Published Tue, Sep 3 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
కొత్తగూడెం, న్యూస్‌లైన్: వచ్చే ఏడాదిలోగా ఖమ్మంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడీ) కళాశాల ఏర్పాటవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వెంకటరత్నం తెలిపారు. దీనికి కావాల్సిన అనుమతులు లభించాయన్నారు. మూడురోజుల పాటు కొత్తగూడెంలో జరిగిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీల ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సింగరేణి మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. గతంలో భద్రాచలంలో బీపీఈడీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నించామన్నారు. ఏజెన్సీ నిబంధనల కారణంగా అనుమతి లభించలేదన్నారు.
ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న బీపీఈడీ కళాశాలకు మాత్రం ఇప్పటికే అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.
భద్రాచలంలో ఏర్పాటు చేయాల్సిన బీపీఈడీ కళాశాలను కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను స్వయంగా క్రీడాకారుడిని కావడం వల్ల చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నానన్నారు. ఎంత ఖర్చు చేసినా ఇప్పటి వరకు జాతీయస్థాయిలో కాకతీయ యూనివర్సిటీకి పతకాలు రాకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. దీనిని అధిగమించేందుకు క్రీడాకారులు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా జాతీయ పోటీలకు వెళ్లిన టీమ్ తెల్లారేసరికి తిరిగి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా మార్కులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
పస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీగా కేయూ ఉందని, కేయూ పరిధిలోని మూడు జిల్లాలు కోల్‌బెల్ట్ ప్రాంతానికే చెందినవి కావడం గమనార్హం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ తోడ్పాటునందించాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలోని భద్రాచలం రీజియన్‌పైనే తనకు ఎక్కువగా నమ్మకం ఉందని, అత్యుత్తమ ఫలితాలు ఈ ప్రాంతం నుంచే వస్తాయని వివరించారు. శరీరం, మేథస్సుకు సమాన ప్రాధాన్యత కల్పించినవారే జీవితంలో రాణించగలుగుతారని పేర్కన్నారు. విద్యార్థులు కూడా ఈ విషయంపై దృష్టి సారించి చదువులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
కప్పగంతుల్లో నా మొదటి బహుమతి...
క్రీడాకారుడిగా తన చిన్ననాటి అనుభవాలను వీసీ గుర్తుచేసుకున్నారు. తాను మూడో తరగతి చదవే రోజుల్లో కప్పగంతుల్లో మొదటి బహుమతి వచ్చిందన్నారు. ఆ స్ఫూర్తితో క్రీడలపై మక్కువ పెంచుకుని.. ఇదే క్రీడాంశంలో డిగ్రీ చదివే రోజుల్లో యూనివర్సిటీ స్థాయిలో మొదటి బహుమతి సాధించానన్నారు. ‘నేను గెలిచిన ప్రతిసారీ బహుమతులు తీసుకునే సమయంలో నేను ఎప్పుడు ఇలా బహుమతులు ఇచ్చేవాడినవుతానా అని కలలు కనేవాడిని..ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం వల్ల వీసీ స్థాయికి చేరాను’ అని వివరించారు.
సింగరేణి సంస్థలో తాను ఇటీవలికాలంలో ఉద్యోగుల ఆరోగ్యంపై సర్వే నిర్వహించానని సింగరేణి డెరైక్టర్ ‘పా’ టి.విజయ్‌కుమార్ తెలిపారు. ఎక్కువ మంది బీపీ, షుగర్‌లతో బాధ పడుతున్నారని బయటపడిందన్నారు. వీటి నుంచి బయటపడేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. తమ సంస్థ మొదటినుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ సంస్థల వలే జాతీయ క్రీడాకారులను స్పాన్సర్ చేస్తామన్నారు. విద్యార్థులు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ డెరైక్టర్ ఎస్.రాధాకృష్ణ, సింగరేణి జీఎం (ఎడ్యుకేషన్) వై.వెంకటేశ్వర్లు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.కమలారాణి, ఫిజికల్ డెరైక్టర్ డాక్టర్ కె.సావిత్రి పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్ సింగరేణి
కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడాపోటీల్లో సింగరేణి మహిళా కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. మొత్తం తొమ్మిది ఈవెంట్స్‌లో ఈ కళాశాలకు చెందిన 35 మంది క్రీడాకారిణులు యూనివర్సిటీ క్రీడలకు ఎంపికయ్యారు. కేయూ యూనివర్సిటీ స్థాయిలో మహిళా క్రీడా పోటీలు ప్రారంభమై ఏడేళ్లవుతుంది. ఈ ఏడేళ్ల నుంచి సింగరేణి మహిళా కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధిస్తుండటం గమనార్హం.
Advertisement
Advertisement