శ్రీకాకుళం సిటీ : రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లో పని చేస్తున్న ఎజైల్ ఏజెన్సీపై వేటుకు రంగం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు రిమ్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రిల్లో సేవలందిస్తున్న ఎజైల్ కంపెనీలపై వేటుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓ చారిటబుల్ ట్రస్ట్ పరిధిలోకి ఆస్పత్రిలో పారిశుధ్యం, సెక్యూరిటీ సేవలు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఏజెన్సీని ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో రిమ్స్‌లో సేవలందిస్తున్న ఎజైల్ ఏజెన్సీకి ఇప్పటికే మెయిల్ చేసినట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిమ్స్‌లో సుదీర్ఘ కాలంగా, ఈ ఏజెన్సీ పరిధిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
రిమ్స్‌లో ఎజైల్ పరిధిలో 130 మంది
ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, సెక్యూరిటీ సేవలు విస్తరించేందుకుగాను 2014 అక్టోబర్ నెల నుంచి మూడేళ్ల కాలపరిమితితో ఎజైల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి పైగా కాల పరిమితి ఉంటుండగా మార్చి 1వ తేదీ నుంచి తొలగించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఏజెన్సీ స్థానిక ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రి, కళాశాలల్లో మొత్తంగా సెక్యూరిటీ 42 మంది, 88 మంది పారిశుధ్య సిబ్బంది ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతీ నెలా రూ.24 లక్షల వరకు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ పరిధిలో పని చేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు పలు సౌకర్యాలు కలిపి రూ.8,500 వేతనం చెల్లిస్తున్నారు.
అసలు కథ ఇదీ...
రాష్ట్ర స్థారుులో కీలక బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి సంబంధించినదిగా చెప్పుకొనే ఓ చారిటబుట్ ట్రస్ట్‌కు ఆస్పత్రుల పారిశుధ్యం, సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రిమ్స్‌లో రెండురోజులుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా డీఎంఈ పరిధిలో ఉండే వైద్య కళాశాలల్లో వీటిని అమలు చేసి క్రమంగా జిల్లాలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అమలుకు నిర్ణయించారు. ఇప్పటికే రిమ్స్‌కు డీఎంఈ నుంచి దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఏజెన్సీ ప్రతినిధులకు రిమ్స్ యంత్రాంగం కూడా మార్చి నెల నుంచే ప్రత్నామ్నాయాలు చూసుకోవల్సిందిగా ఆదేశిస్తూనే ఆ సంస్థ (హైదరాబాదు) ప్రతినిధులకు ఓ మెయిల్ కూడా చేశారు. ఒక్క రిమ్స్‌లోనే కాకుండా జిల్లాలో ఏరియా ఆస్పత్రులైన టెక్కలిలో 60 మంది, పాలకొండలో 48 మంది, రాజాంలో 30 మంది వరకు ఎజైల్ పరిధిలో పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. కాగా సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వాసుపత్రుల్లో తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తాజాగా తెలిసింది.
నోటీసులు ఇచ్చాం...
ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో డెరైక్టర్ ఎజైల్ కంపెనీ ప్రతినిధులకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఏజెన్సీ బదులుగా ప్రభుత్వం సూచించిన కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నారు. డీఎంఈ నుంచి రిమ్స్‌కు ఆదేశాలు వచ్చాయి.
-డా. సునీల్‌నాయక్,
రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్
కాంట్రాక్టు పూర్తి కాలేదు...
ప్రభుత్వాస్పత్రుల్లో తమ సేవలకు సంబంధించి 2017వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి నెల నుంచి కొత్త ఏజెన్సీకి అవకాశం ఇవ్వనున్నట్లు రిమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తమ ఉన్నతాధికారులకు రిమ్స్ యంత్రాంగం మెయిల్స్ కూడా చేసింది. కొత్త ఏజెన్సీ పేరుతో తమకు వేటు వేస్తే ఎలా..
దువ్వ శేషు, రిమ్స్ ఎజైల్ సంస్థ పీఆర్‌వో,
ఎజైల్ సంస్థపై వేటు!
Published Sat, Feb 20 2016 11:46 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement