అమ్మకానికి ‘ఆత్మఘోష’! | Agri Gold victims strike | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘ఆత్మఘోష’!

Jun 1 2018 3:19 AM | Updated on Aug 11 2018 9:14 PM

Agri Gold victims strike - Sakshi

సాక్షి, గుంటూరు: అధికార పార్టీతో కుమ్మక్కై కొందరు నేతలు అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మఘోష వినిపించకుండా అడ్డుపడ్డారు. వేలాదిమంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఆత్మఘోష పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు ఏకపక్షంగా ప్రకటించటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిద్రాహారాలు మాని సిద్ధమైన బాధితులు
అగ్రిగోల్డ్‌ బాధితులు రెండు రోజులుగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో న్యాయ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం గుంటూరు నుంచి రాజధాని ప్రాంతంలోని సచివాలయం వరకు ఆత్మఘోష పాదయాత్ర నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుటే తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది అగ్రి బాధితులు భావించారు. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు నిరసన దీక్ష చేపట్టారు.

ఆత్మఘోష యాత్ర ద్వారా తమ ఆందోళన  ప్రభుత్వానికి తెలియ చేయాలని భావించారు. అయితే అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లోని కొందరు నేతలు అధికార పార్టీ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించటంతో రాత్రికి రాత్రే సీన్‌ మారిపోయింది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యుడైన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబుతో హామీలు ఇప్పించి ఆత్మఘోష యాత్ర నిర్వహించకుండా అడ్డుపడ్డారు.

ఆత్మఘోష పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టుప్రకటించారు. ప్రభుత్వం అగ్రి బాధితుల సమస్యపై చిత్తశుద్ధితో ఉందని, త్వరలోనే పరిష్కారం కనుగొంటామని మంత్రి చెప్పారు. అగ్రి గోల్డ్‌ ఆస్తులను ఎస్‌ఎల్‌ గ్రూప్‌ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినా ప్రతిపక్షాలు బెదిరించడంతో వెనక్కి తగ్గిందని ఆరోపించారు.

మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
మంత్రి హామీ ఇచ్చినందున ఆత్మఘోష పాదయాత్రను వాయిదా వేయాలని కొందరు సూచించటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మాయమాటల మంత్రి అంటూ అగ్రి బాధితులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారికి సర్ది చెప్పేందుకు అసోసియేషన్‌ నేతలు తిప్పలు పడ్డారు. సమస్యను పక్కదారి పట్టిస్తున్న అసోసియేషన్‌ నేతలపై అగ్రి బాధితులు మండిపడ్డారు.


కచ్చితమైన గడువు ప్రకటించాలి: చలసాని
అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారంపై కచ్చితమైన గడువు ప్రకటించాలి. మంత్రి మాటలు బాధితులకు భరోసా ఇచ్చేలా లేవు. – చలసాని శ్రీనివాస్, మేధావుల సంఘం అధ్యక్షుడు.

రాజకీయాలు చేయొద్దు
రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. పదే పదే జగన్, పవన్‌ అడ్డుపడుతున్నారంటూ అనటం సరికాదు. వారు చెయ్యి అడ్డుపెడితే ప్రభుత్వం ఆగుతుందా? ఎస్‌ఎల్‌ గ్రూప్‌ వెనక్కిపోతే మరో గ్రూప్‌ ద్వారా కొనుగోలు చేయించే బాధ్యత ప్రభుత్వానిదే. రెండు లక్షల బడ్జెట్‌ ఉండే రాష్ట్రానికి 20 లక్షల మంది బాధితులకు సంబంధించి రూ. రెండు వేల కోట్లు కేటాయించడం పెద్ద సమస్య కాదు. – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

చనిపోతాం...రూ. 5 లక్షలు ఇవ్వండి
మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చెప్పే మాటలు వింటూనే ఉన్నాం. గడువు చెప్పకుండా మంత్రి అతి త్వరలో న్యాయం చేస్తామంటూ చెప్పడం దారుణం. చార్జీలకు కూడా డబ్బులు లేకపోయినా అప్పు చేసి ఇక్కడకు వచ్చాం. ఏం ఒరిగిందని యాత్ర వాయిదా వేశారో అర్ధం కావడం లేదు. న్యాయం చేయకపోతే చెప్పండి చనిపోతాం. కనీసం చచ్చాకైనా రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి.  – రమణమ్మ (తూర్పు గోదావరికి చెందిన అగ్రి బాధితురాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement