అహోబిలం దేవస్థానం(ఇన్‌సెట్) కలెక్టర్ ముందే వాగ్వాదం చేసుకుంటున్న ఈఓ, మఠం ప్రతినిధి
అహోబిలం (ఆళ్లగడ్డ): దేశంలోని 108 వైష్ణవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరుగాంచిన అహోబిలంలో దేవస్థాన, మఠం ప్రతినిధుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి . భక్తులు హారతి పల్లెంలో వేసిన డబ్బులో భాగం కావాలని దేవస్థానం అటెండర్ హుకుం జారీ చేశాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తామని కొందరు అర్చకులు ఎదురు తిరగగా హారతి పల్లెంలోని డబ్బులన్నీ తీసి హుండీలో వేసేటట్లు చక్రం తిప్పాడు. దీంతో ఒకనొక దశలో అర్చకులందరూ విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ ఓ ఎత్తైతే దేవస్థాన ఈఓ చెక్‌పవర్ పూర్తిగా మఠం ప్రతినిధి చేతిలోకి వెళ్లి పోయింది. సిబ్బంది జీతాల మొదలు దేవస్థాన పరిధిలో ఏ ఖర్చు పెట్టాలన్నా మఠం ప్రతినిదే చెక్కు ఇవ్వాలి. దీనిని అవమానంగా భావించిన దేవస్థానం అధికారులు మఠం ప్రతినిధులపై కక్షగట్టినట్టు సమాచారం. దీంతో ఇరువురు మధ్య పంతాలు, పట్టింపులు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే ఎప్పటిలాగే వైకుంఠ ఏకాదశి అయిన మంగళవారం పల్లకీ మోసే బోయలకు ఈసారి ఈఓ తాఖీదు పంపలేదు. దీంతో వారు స్వామి పల్లకీని మోయమని నిరసనకు దిగారు. ఈ విషయం మంత్రి భూమా అఖిలప్రియ దృష్టికి వెళ్లగా ఆమె ఈఓను పిలిచి గట్టిగా మందలించింది. అయినా, ఈఓ వ్యవహర తీరులో మార్పు కనిపించకపోవడంతో బోయలు స్వామి పల్లకీని మోయమని భీష్మించుకొని కూర్చున్నారు. చివరకు మఠం ప్రతినిధి జోక్యం చేసుకుని తాఖీదు పై సంతకం పెట్టిస్తానని వారికి ఒప్పించాడు. మీరు చెబితే నేనెందుకు తాఖీదు ఇస్తా మీరే (మఠం తరపున) ఇచ్చుకోండని ఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మఠం ప్రతినిధి మంగళవారం అహోబిలం వచ్చి న కలెక్టర్ సత్యనారాయణకు జరిగిన విషయం చెప్పబోయాడు. పక్కనే ఉన్న ఈఓ అడ్డుపడగా ఆగ్రహించిన మఠం ప్రతినిధి నీవు అంతా ఫ్రాడ్ చేస్తున్నావని అన్నాడు. దీనికి ఈఓ ‘నేను ఫ్రాడే చేస్తాను’ అని కలెక్టర్, ఇతర అధికారుల ఎదుటే గట్టిగా అనడంతో పక్కనున్న వారికి కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కలెక్టర్ ముందే ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అక్కడే ఉన్న ఆళ్లగడ్డ తహసీల్దార్ ఈఓను సున్నితంగా మందలించారు.
కోర్టును ఆశ్రయించిన మఠం ప్రతినిధులు!
అహోబిల క్షేత్రం పూర్తి పర్యవేక్షణ, అధికారాలు తమకే ఇవ్వాలని అహోబిల మఠం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అహోబిలంలో రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖల అధికారులు ఉండకూదని కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదే జరిగి పూర్తి బాధ్యతలు, పర్యవేక్షణ అధికారాలు అంతా మఠానికి అప్పగిస్తే పరిపాలనంతా తమిళనాడు నుంచి కొనసాగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెక్ పవర్ కోసం విశ్వప్రయత్నం..
దేవస్థాన పరిధిలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, సిబ్బంది జీతాలు అన్నింటికి చెక్ రాసిచ్చేది మఠం పీఠాధిపతి అయినప్పటికీ అ డబ్బులు బ్యాంకులో జమ చేసిన తరువాత ఎవరికి ఎంతివ్వాలి అన్నది ఈఓ పరిధిలో ఉంటుంది. కొంతకాలంగా ఈ పవర్ కూడా మఠం ప్రతినిధి చేతిలోకే వెళ్లడంతో ఈఓ కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యాడు. ఎలాగైనా మఠం ప్రతినిధుల చేతుల్లోకి పోయిన చెక్‌పవర్ తిరిగి పొందాలని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నివురుగప్పిన నిప్పులా అహోబిలం
అర్చకులు, సిబ్బంది ఎవరికి వారు యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తుండటంతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు తెగబడుతున్నారు. చివరకు దేవస్థానం రహస్యాలు సైతం బయటకు పొక్కుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment