మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేత దిశగా రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను వదిలించుకోవాలని చూస్తుండగా యాజమాన్యాలు తమ ఆధీనంలో ఉన్న పాఠశాలలను పట్టించుకోకపోవటంతో మూసివేత తప్పదనే వాదన వినిపిస్తోంది. మూతపడే పాఠశాలల జాబితాలు ఇప్పటికే తయారైనట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 31వ తేదీలోగా రేషనలైజేషన్ ప్రకారం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు పది మంది విద్యార్థులుంటే పాఠశాల ఉంచాలనే నిబంధన ఉండగా ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం ఈ సంఖ్యను 30కు పెంచారు. 29 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.
ఈ లెక్కన ఆర్‌సీఎం యాజమాన్యంలో 40 పాఠశాలలు, సీఎస్‌ఐ యాజమాన్యంలో 45 పాఠశాలలు సీబీసీఎన్‌సీ యాజమాన్యంలో మరో 10 పాఠశాలలు మూతపడతాయని అటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర సమ్మెలో సిబ్బంది పాల్గొంటున్న కారణంగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత ప్రక్రియను ముగించేందుకు కొంత సమయాన్ని ఇవ్వాలని సీమాంధ్ర జిల్లాలకు చెందిన డీఈవోలు ప్రభుత్వానికి లేఖ రాశారు. సమైక్యాంధ్ర సమ్మె లేకుంటే ఈ నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.
పాఠశాల రద్దైతే పోస్టులు శాశ్వతంగా రద్దు ...
జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 850 వరకు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1300 మంది ఉపాధ్యాయులున్నారు. ఏదైనా పాఠశాలను మూసివేస్తే ఆ పాఠశాలలో ఉన్న పోస్టులు శాశ్వతంగా రద్దవుతాయి. పాఠశాల రేషనలైజేషన్ ప్రకారం రద్దయితే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతి ఇచ్చి వేరే పాఠశాలలో వారి సేవలు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఆర్‌సీఎం సంస్థకు చెందిన నన్స్‌కు పదోన్నతుల్లో ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన ఉపాధ్యాయుల నుంచి తమకు పదోన్నతి వద్దని లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు లేఖలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా లేఖ ఇస్తే పదోన్నతి తిరస్కరించిన విషయాన్ని ఎస్‌ఆర్‌లో నమోదు చేస్తారు. ఎస్‌ఆర్‌లో ఈ విషయం నమోదైతే గతంలో పొందిన ఇంక్రిమెంట్లను వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు.
సర్దుబాటు...
రేషనలైజేషన్ ప్రకారం రద్దయిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా యాజమాన్యాలు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఈ సమయంలో ఆయా యాజమాన్యాలకే సర్వాధికారాలు ఉంటాయి. రద్దయిన పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటే ముందుగా ఆ పాఠశాల హెచ్‌ఎంకు పదోన్నతి ఇస్తారు. అనంతరం స్కూలు అసిస్టెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. పదోన్నతులు ఇచ్చే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఆయా యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను మొత్తానికి సీని యార్టీ పరిగణనలోకి తీసుకుంటారు. సీఎస్‌ఐ, ఆర్‌సీఎం పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే రెండు యాజమాన్యాల అంగీకా రం ప్రకారం ఉపాధ్యాయులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇస్తారు. ఈ తతం గం జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. పదేళ్ల క్రితం ఎయిడెడ్ పాఠశాలలు రద్దయితే సంబంధిత ఉపాధ్యాయుడి సేవలను దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విని యోగించుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం ఈ ఉత్తర్వులను మార్పు చేసి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగించకూడదని సవరించినట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
చక్రం తిప్పుతున్న యాజమాన్యాలు ...
ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియ, పాఠశాలల రద్దు వేగం పుంజుకోవటంతో ఆయా యాజమాన్యాల ప్రతినిధులు రద్దయ్యే పాఠశాలల జాబితాల తయారీ, పదోన్నతులు పొందాల్సిన వివరాలను ఇప్పటికే సేకరించారు. విజయవాడ డివిజన్‌లో ఈ ప్రక్రియ పూర్తికాగా, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, నందిగామ డివిజన్లలో ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. పాఠశాలలు రద్దవుతున్నా వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించని యాజమాన్యాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలంటే, కోరుకున్న ప్రాం తంలో పోస్టింగ్ ఇవ్వాలంటే తమను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని రాయబారాలు పంపుతున్నారు. పోస్టుల సర్దుబాటు కావాలంటే విద్యాశాఖాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాలని అడిగిన మొత్తం ఇవ్వకుంటే మీరే ఇబ్బంది పడతారని ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం.