ఎన్నికలే లక్ష్యం..
Published Fri, Sep 13 2013 3:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో వేడి పెరిగింది. ఆ పార్టీ నేతలు గెలుపుకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎక్కువగా తన నియోజకవర్గంపైనే దృష్టి సారించి కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ప్రజలకు చేరువ కావడానికి యత్నిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇచ్చిన ఊపుతో ముందుకు సాగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన కాలంలో ఈ ప్రాంతంలో పర్యటించడానికే అధికార పార్టీ నేతలు భయపడ్డారు. ఆందోళనలకు వెరసి నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన బోధన్‌పైనే ఎక్కువగా దృష్టి సారించారు. జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలను బోధన్ నియోజకవర్గంలోనే నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం, ఇటీవల జరిగిన సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో అప్రమత్తమైన ఆయన తన నియోజకవర్గంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలపై దృష్టి సారించి, కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేశ్ కమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌లు సైతం రూరల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాల్కొండలో ప్రభుత్వ విప్ అనిల్, ఆర్మూర్‌లో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రజల మధ్యకు వెళుతున్నారు.
అభివృద్ధి పనులతో.. నవీపేట మండలం శాఖాపూర్ వద్ద రూ. 4.73 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సుదర్శన్‌రెడ్డి వారం క్రితం ప్రారంభించారు. ఈ పథకంతో మండలంలోని మంత్రి సొంత గ్రామమైన సిరన్‌పల్లితోపాటు శాఖాపూర్, బినోల, లింగాపూర్, నిజాంపూర్ పరిధిలోని 2,052 ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా జిల్లాలో 3.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందంచే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సొరంగ మార్గం పనులు బోధన్ నియోజక వర్గం పరిధిలో సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించడంతో పాటు నీటివనరుల పెంపుదల కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ నుంచి బోధన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 30 కోట్లు మంజూరు చేయించిన మంత్రి.. పనులు వేగంగా సాగేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నీటివనరుల పెంపులో భాగంగా బోధన్ మండలం పెద్దమావిడి వద్ద రూ. 10 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాలూరా ఎత్తిపోతల పథకానికి సంబంధించి పైపులైన్ల నిర్మాణం కోసం రూ. 42 లక్షలు మంజూరు చేయించి పనులు జరిగే విధంగా కృషి చేస్తున్నారు. నవీపేట మండలంలో 4 ఎత్తిపోతల పథకాల మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనులే అన్న విమర్శలున్నప్పటికీ ప్రజలకు ఎంతోకొంత మేలు జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement