భోగాపురం, విజయనగరం కంటోన్మెంట్:మనుషులతోనే కాదు మట్టితో కూడా వారు అనుబంధం పెంచుకున్నారు. ఊరు, చెట్టుచేమ, ఇళ్లు,పశువులు,పొలాలు, చెరువులు ఇలా అన్నింటితోనూ వారిది విడదీయరాని బంధం. అయితే ఇప్పుడా బంధాన్ని తెంపేస్తున్నారు. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం గ్రామాలను చెరబడుతోంది. దీంతో ఎంతో ప్రశాంతంగా ఉండే భోగాపురం ఇప్పుడు రగిలిపోతోంది. బాధిత తొమ్మిది గ్రామాల్లోని ప్రజలు వినూత్న తరహాలో ఆందోళనలు చేస్తున్నారు. మరో పక్క అధికారుల ప్రకటనలు, ప్రభుత్వ చర్యలు వారి గుండెలను పిండేస్తున్నాయి. ఇంతవరకూ నేలతల్లిని నమ్ముకుని గుట్టుగా సాగుతున్న తమ బతుకులను వీధిన పడేస్తున్నారన్న బాధ వారి హృదయాలను మెలిపెట్టేస్తోంది. బతుకులు బజారుపాలవుతాయన్న ఆవేదనతో శనివారం తెల్లవారు జామున వెంపడా సూరి(53) అనే రైతు గుండె ఆగిపోయింది.
ఎయిర్‌పోర్టుకు బలైన రెండో గుండె ఇది. ఈ విషయం తెలిసిన ప్రజలు మరింత రగిలిపోయారు. తమ సమాధులమీద ఎయిర్‌పోర్టు నిర్మించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి. మొట్టమొదటగా దల్లిపేట పంచాయతీలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తరువాత గూడెపువలస, రెడ్డికంచేరు, భెరైడ్డిపాలెం, దల్లిపేట, ఏ.రావివలస, జమ్మయ్యపేట, కవులవాడ, మరడపాలెం గ్రామాల్లో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆడామగా, ముసిలీముతక అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వస్తున్నారు. యువకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వాన్ని పెద్ద పీడగా భావిస్తూ... పి భెరైడ్డిపాలెం గ్రామంలో మహిళలు రోడ్డుకు అడ్డంగా వేపరెమ్మలు కట్టి నిరసన తెలిపారు. ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దుతు లభిస్తోంది. వైఎస్‌ఆర్ సీపీ నేతలు మొదటి నుంచి పోరాటంలో మమేకమయ్యారు. ఐద్వా నేతలు కూడా మద్దతు పలికారు. శనివారం ఐద్వా నాయకులు వి.ఇందిర, లక్ష్మిలు దల్లిపేటలోని రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు.
నిప్పుకణికిలా...
Published Sat, Sep 12 2015 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement