
బ్రిటీష్ పాలకులను తలపిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
రాజంపేట : వైఎస్ జగన్‌మోహనరెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం శాంతి యుతంగా బంద్ పాటిస్తుంటే నీర్వర్యం చేసేందుకు బ్రిటీష్ పాలకుల్లా అరెస్టులు చేయించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన పోలీస్‌స్టేషన్ వద్ద, తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలుపుకోవచ్చన్నారు. ప్రశాంతంగా.. బంద్ చేస్తున్న వారిని అరెస్టు చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహం దాగి ఉందన్నారు. బంద్ విజయవంతం అవుతోందని గమనించిన ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ప్రజల భవిష్యత్ కోసమే వైఎస్‌ఆర్‌సీపీ బంద్ చేపట్టిందని చెప్పారు. అందువల్లే ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆ విషయం గురించి క్యాబినెట్‌లో చర్చించక పోవడం దుర్మార్గమన్నారు. ఏ ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సమానం కాదన్నారు. హోదా సాధించే దాక పోరాటం ఆగదని చెప్పారు. జిల్లా బంద్‌కు సహకరించిన ప్రజలు, సీపీఎం, సీపీఐ, కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.