కల..సాకారం | Akkannapet - Medak railway line laid the foundation of tomorrow | Sakshi
Sakshi News home page

కల..సాకారం

Published Sat, Jan 18 2014 12:09 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM

Akkannapet - Medak railway line laid the foundation of tomorrow

మెదక్, న్యూస్‌లైన్: మెతుకు సీమ ప్రజలకు సంక్రాంతి పండగ తీపి కబురు మోసుకొచ్చింది. మూడు దశాబ్దాలుగా కలగా ఉన్న అక్కన్నపేట- మెదక్ రైల్వేలైన్ ఎట్టకేలకు సాకారమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు సంసిద్ధత తెలపడంతో ఈ మార్గానికి పచ్చ జెండా ఊపినట్లయింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ ప్రాజెక్టు పనులకు ఆదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆనందోత్సహాన్ని కనులారా వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు, రైల్వేలైన్ మంజూరు కోసం నిరంతర పోరాడిన ప్రజాప్రతినిధులు .. ఉద్యమ సంఘాలు నేతలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. మెదక్ జూనియర్ కళాశాల మైదాన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే వారం రోజుల్లో రెండు సార్లు రైల్వే శాఖ డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ సధర్మదేవరాయ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
 
 రైల్వేలైన్ వివరాలు
అక్కన్నపేట నుండి మెదక్ పట్టణానికి 17.5 కి.మీ దూరం(పుష్ పుల్ )వచ్చి, వెనక్కి వెళ్ళే రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి లభించింది. ఇందుకు సుమారురూ.129.32 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. అక్కన్నపేట నుంచి మెదక్ వచ్చే దారిలో లక్ష్మాపూర్, శమ్నాపూర్‌లలో కూడా రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మెదక్ పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్ వెనకాల రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. మెదక్‌లో 14 సిబ్బంది క్వార్టర్లు, 530 మీటర్ల ప్లాట్‌ఫాంతో కూడిన అధునాతన స్టేషన్ నిర్మిస్తారు.
 
ఉద్యమం ఊపిరి పోసుకున్న తీరు..
బిందువే సింధువైనట్లు..కేవలం ఆరు మందితో ప్రారంభమైన రైల్వే ఉద్యమం.. మహోద్యమంగా మారింది. ఆర్భాటాలకు దూరంగా..పార్టీలకు అతీతంగా.. పట్టు వదలని విక్రమార్కుల్లా... ఉద్యమ కారులంతా ఉక్కు పిడికిలి బిగించి అనుకున్నది సాధించారు. రైల్వే సాధన సమితి పోరాటానికి ప్రజాప్రతినిధులు తోడవడంతో లక్ష్యం దరిచేరింది. పర్యాటక అందాలకు.. ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలకు.. వాణిజ్యానికి .. వ్యవసాయ దిగుబడులకు నిలయం మెతుకు సీమ. కానీ ఈ ప్రాంతానికి రైలు మార్గం లేక అభివృద్ధి కుంటుపడిందన్నది మెజార్టీ ప్రజల భావన. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చి, తెలంగాణకే తల మాణికాలైన ఏడుపాయల దుర్గాభవాని, మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, ఇంజనీరింగ్, బీఎడ్, డీఎడ్, పీజీ కళాశాలలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు, విద్యార్థులు ఈ ప్రాంతాలకు తరలివస్తుంటారు. రైల్వే లైన్ ఉంటే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుందని అందరూ భావించారు. ఇందుకోసం 1980 ప్రాంతంలో రైల్వేలైన్ సాధన కోసం ఉద్యమం ఊపిరి పోసుకుంది.
 
 2000 సంవత్సరంలో ఏర్పడిన రైల్వే సాధన సమితి కీలక పాత్ర పోషించింది. అనేక రకాల ఉద్యమాలతో పోరుబాట సలిపింది. రైల్వేసాధన సమితి అధ్యక్షులు సుభాష్ చంద్రగౌడ్ అధ్వర్యంలో చిరిగిన టెంట్‌లో, రంధ్రాలు పడ్డ జంకానాలో, చందాలు వేసుకొని సమకూర్చుకున్న కేవలం రూ .2 వేల వ్యయంతో 36 రోజుల నిరాహార దీక్షలు చేశారు. రాస్తారోకోలు, బంద్‌లు, ర్యాలీలు, ఢిల్లీ పర్యటనలు, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యంగా మెదక్ ఎంపీ విజయశాంతి  అలుపెరుగని పోరాటం చేశారు. కేంద్ర రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి , రైల్వేశాఖ అధికారులతో నిరంతరం  మాట్లాడుతూ తన వంతు కృషి చేశారు. అలాగే మాజీ మంత్రులు బండారు దత్తాత్రేయ, నరేంద్ర, ఎమ్మెల్యే మైనంపల్లి హన ్మంత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, న్యాయవాదులు, విద్యార్థి, యువజన, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులు, ఇతర మేధావులు, రైల్వే ఉద్యమానికి ఊపిరిలూదారు.
 
 రాష్ట్ర వాటాకు యస్ అన్న ‘వైఎస్’  
 అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో తన అంగీకారం తెలిపారు. దీంతో 2010 రైల్వే బడ్జెట్‌లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద కొత్త రైల్వేలైన్‌ల జాబితాలో అక్కన్నపేట- మెదక్ లైన్‌కు చోటు దక్కింది. 20ఛి11 బడ్జెట్‌లో ఆశించిన ఫలితం దక్కకపోయినప్పటికీ 2012 రైల్వే బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు రైల్వే శాఖ నుండి రూ. కోటి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.కోటి, ఎంపీ విజయశాంతి తన కోటా నుంచి రూ.1 కోటి, 2013 బడ్జెట్‌లో రూ 1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రైల్వే లైన్ సర్వే, భూ వివరాల సేకరణ, రైల్వే స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇందుకు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితో పాటు, అటవీశాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసర మవుతుందని అధికారులు తేల్చారు. అయితే భూసేకరణ పూర్తయి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు టెండర్లు పిలవాల్సి ఉంది.
 
 రేపే నిజమైన సంక్రాంతి
 మూడు దశాబ్దాల మెదక్ ప్రజల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో రేపు నిజమైన సం క్రాంతి. రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులందరికీ నా కృతజ్ఞతలు. పనులు పూర్తి చేయాలని కోరుతున్నా.
 -విజయశాంతి, మెదక్ ఎంపీ
 
 త్వరగా పూర్తిచేయాలి
 రాష్ట్రంలో పెండిం గ్‌లో ఉన్న రైల్వే లైన్ నిధులను అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు బదిలీ చేయాలి. 2014 బడ్జెట్‌లో పూర్తి స్థాయి నిధులను విడుదల చేయాలి. రైల్వేలైన్ కోసం నిరుపేదలు చేసిన పోరాటమిది. పార్టీల కతీతంగా నాయకులూ సహకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిది. రైల్వే లైన్ మంజూరుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
 -సుభాష్ చంద్రగౌడ్, రైల్వేసాధన సమితి అధ్యక్షులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement