akkannapet
-
కాల్పుల్లో కొత్తకోణం.. సినిమాలో చూసి ఫైరింగ్
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని అక్కన్నపేట కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. 2016లో హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి ఏకే–47 చోరీచేసిన సదానందం ఇంతకాలం ఎలా మెయింటైన్ చేశాడన్న విషయంపై పోలీసులు కూపీలాగుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదానందం విపరీత, సున్నిత మనస్తత్వమున్నవాడు. ఆయుధాలన్నా, తుపాకులన్నా పిచ్చి. ఈ పిచ్చే ఠాణాలో తుపాకులు చోరీచేసే వరకూ తీసుకెళ్లింది. వీటిని దొంగిలించాక ఇంట్లోనే దాచి, ఎవరూలేని సమయంలో చూసుకుని మురిసిపోయేవాడు. సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్ చేయడం నేర్చుకున్నాడు. వెలుగులోకి వచ్చింది ఇలా... ఏకే–47 ఆయుధాన్ని తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందే చోరీ చేశాడు. తన పాత కేసుల క్రమంలో తరచూ హుస్నాబాద్ స్టేషన్‌కి వెళ్లివచ్చే సదానందం దృష్టిని అక్కడి ఆయుధాలు ఆకర్షించాయి. ఏకే–47, కార్బైడ్లను చోరీ చేశాడు. ఆయుధాల చోరీ విషయాన్ని పోలీసులు దాచిపెట్టడంతో చాలాకాలం ఇది వెలుగులోకి రాలేదు. గతంలో హుస్నాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ పరిధిలో ఉండేది. 2016, అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం డిసెంబర్లో సిద్ధిపేట జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లిపోయింది. అదే ఏడాది డిసెంబర్లో ఆయుధాలను కమిషనరేట్‌కి లెక్కచూపే క్రమంలో ఏకే–47 మిస్సింగ్ విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటి సీఐ గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అక్కన్నపేట కాల్పుల తరువాతే 9ఎంఎం కార్బన్గన్ కూడా పోయిన విషయం వెల్లడికావడం గమనార్హం. తుపాకీ పోగొట్టుకుంటే..? పోలీసుల తుపాకులు కనిపించకుండా పోతే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే రాష్ట్ర పోలీసులు ఈ సందేశాన్ని రేడియో ద్వారా ఇండియాలోని అన్ని స్టేషన్లకు పంపుతారు. ఈ విషయంలో స్థానిక ఎస్పీ లేదా కమిషనర్ ఒక డీఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తారు. సదరు అధికారి ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో పోయిందో దర్యాప్తు చేస్తారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తారు. అంతేగాకుండా ఈ విషయాన్ని తరువాత లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖతోపాటు రాష్ట్రం, దేశంలోని అన్ని పోలీస్‌ఠాణాలకు పంపుతారు. కాగా, గతంలో హుస్నాబాద్ ఠాణాలో పనిచేసిన సీఐ భూమయ్య, సీఐ శ్రీనివాస్‌ల హయాంలో ఈ ఆయుధాలు మాయమయ్యాయన్న విషయంలో స్పష్టత కరువైంది. అలాగే కార్బన్ వెపన్ మిస్సింగ్ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్టేషన్ నుంచి 25 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న ఏకే–47 వెపన్‌ను ఎత్తుకెళితే ఎందుకు గుర్తించలేకపోయారు. స్టేషన్లో సీసీ కెమెరాలు లేవా? సంబంధిత గన్‌మెన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు? అంతటి మారణాయుధం పోయినా.. తూతూమంత్రంగా దర్యాప్తు జరపడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు. వారంలో రెండు కాల్పుల ఘటనలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే వారంలో రెండు కాల్పుల ఘటనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఫిబ్రవరి 1న జగిత్యాల సమీపంలోని గొల్లపల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో శ్రీనివాస్(మాజీ మావోయిస్టు) తుపాకీతో హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో అత్తగారింటిపై దాడి చేసి, అడ్డుకున్న రాజిరెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఫిబ్రవరి 6న అక్కన్నపేటలో సదానందం కాల్పులు జరపడం కలకలం రేపింది. -
అక్కన్నపేటలో ఏకే–47 కాల్పులు
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్/ అక్కన్నపేట : హుస్నాబాద్‌లో ఏకే–47 శబ్దం వినిపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గొర్రెల కాపరిగా ఉంటున్న వ్యక్తి ఏకే–47 గన్ పట్టుకొని తిరగడం, చిన్న గొడవ పెద్దది కావడంతో ఎదుటి వారిపై కాల్పులు జరిపిన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిమెంట్ ఇటుకల చేబదులుపై తలెత్తిన ఓ గొడవ పెద్దదై ఏకే–47 గన్‌తో కాల్పుల వరకు వచ్చింది. కోహెడకు చెందిన దేవుని సదానందం అక్కన్నపేటలోని తన మేనమామ గుంటి వెంకటయ్య ఇంటికి 2010లో వచ్చి పదేళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కన్నపేటకు చెందిన గుంటి గంగరాజు వెంకటయ్య వద్ద సిమెంట్ ఇటుకలను చేబదులు తీసుకున్నాడు. తర్వాత ఇటుకల విషయంలో సదానందం, గంగరాజు మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో కోపంగా ఉన్న సదానందం బుధవారం గంగరాజు తల్లి ఎల్లవ్వ వద్దకు తల్వార్‌తో వెళ్లి చంపుతానని బెదిరించాడు. అలాగే గురువారం రాత్రి సదానందం నల్లటి దుస్తులు, తలకు నల్లటి క్యాప్ ధరించి, భుజానికి ఏకే–47 తుపాకీ వేసుకొని అది పని చేస్తుందా లేదా అని ఇంటి ముందు నేలకేసి కాల్చాడు. ఈ శబ్దానికి ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై గంగరాజుకు చెప్పారు. దీంతో గంగరాజు, కుటుంబ సభ్యులు భయంతో ఇంటి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గంగరాజు ఇంటికి వచ్చిన సదానందం తుపాకితో కిటికీ నుంచి ఇంట్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు. మాజీ మావోయిస్టుగా అనుమానం సదానందానికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే స్వస్థలం కోహెడలో ఉన్న సమయంలోనే సదానందం పదేళ్లు కన్పించకుండా పోయాడని తెలుస్తోంది. తర్వాత తిరిగి వచ్చి అక్కన్నపేటలో ఉంటున్నాడు. అయితే అతను గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాయమైన ఏకే–47 ఇదేనా.? గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులను సిద్దిపేట జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పం పించారు. ఈ సందర్భంగా ఒక ఏకే–47, మరో ఎస్ఎల్ఆర్ తుపాకీ మాయమైంది. గురువారం అక్కన్నపేటలో ఏకే– 47 గన్ కాల్పుల ఉదాంతం బయటకు రావడంతో కనిపించకుండా పోయిన గన్ ఇదేనా అనే చర్చ జరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎస్సై పాపయ్యనాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలిం చారు. అక్కడ 3 తుపాకీ గుండ్లతో పాటు తుపాకీ బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదా నందం ఇంటిని సోదాచేశారు. ఇంటిలో తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదానందంకోసం గాలిస్తున్నారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత ఈ ఘటనపై ఆరా తీశారు. గంగ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం 3 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో కేసును ఛేదిస్తామని ఇన్చార్జి సీపీ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల అదుపులో నిందితుడు సదానందం? ఇదిలా ఉండగా పరారైన నిందితుడు దేవుని సదానందంను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సదానందం ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అదే సమయంలో గుర్తు తెలియని నంబర్ ద్వారా సదానందం ఇద్దరు భార్యల్లో ఒకరికి ఫోన్ చేసినట్లు తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు సదానందం చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నట్లు సమాచారం. అతడిని కోహెడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపిన పోలీసులు అక్కడి నుంచి వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. సదానందంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించలేదు. -
నిలిచిన గూడ్స్ రైలు: రైళ్ల రాకపోకలకు అంతరాయం
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో గూడ్స్ రైలు సాంకేతికలోపంతో నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో గూడ్స్ రైలు సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాంతో ఆ రైళ్లలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కల..సాకారం
మెదక్, న్యూస్‌లైన్: మెతుకు సీమ ప్రజలకు సంక్రాంతి పండగ తీపి కబురు మోసుకొచ్చింది. మూడు దశాబ్దాలుగా కలగా ఉన్న అక్కన్నపేట- మెదక్ రైల్వేలైన్ ఎట్టకేలకు సాకారమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు సంసిద్ధత తెలపడంతో ఈ మార్గానికి పచ్చ జెండా ఊపినట్లయింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ ప్రాజెక్టు పనులకు ఆదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆనందోత్సహాన్ని కనులారా వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు, రైల్వేలైన్ మంజూరు కోసం నిరంతర పోరాడిన ప్రజాప్రతినిధులు .. ఉద్యమ సంఘాలు నేతలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. మెదక్ జూనియర్ కళాశాల మైదాన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే వారం రోజుల్లో రెండు సార్లు రైల్వే శాఖ డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ సధర్మదేవరాయ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రైల్వేలైన్ వివరాలు అక్కన్నపేట నుండి మెదక్ పట్టణానికి 17.5 కి.మీ దూరం(పుష్ పుల్ )వచ్చి, వెనక్కి వెళ్ళే రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి లభించింది. ఇందుకు సుమారురూ.129.32 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. అక్కన్నపేట నుంచి మెదక్ వచ్చే దారిలో లక్ష్మాపూర్, శమ్నాపూర్లలో కూడా రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మెదక్ పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్ వెనకాల రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. మెదక్‌లో 14 సిబ్బంది క్వార్టర్లు, 530 మీటర్ల ప్లాట్‌ఫాంతో కూడిన అధునాతన స్టేషన్ నిర్మిస్తారు. ఉద్యమం ఊపిరి పోసుకున్న తీరు.. బిందువే సింధువైనట్లు..కేవలం ఆరు మందితో ప్రారంభమైన రైల్వే ఉద్యమం.. మహోద్యమంగా మారింది. ఆర్భాటాలకు దూరంగా..పార్టీలకు అతీతంగా.. పట్టు వదలని విక్రమార్కుల్లా... ఉద్యమ కారులంతా ఉక్కు పిడికిలి బిగించి అనుకున్నది సాధించారు. రైల్వే సాధన సమితి పోరాటానికి ప్రజాప్రతినిధులు తోడవడంతో లక్ష్యం దరిచేరింది. పర్యాటక అందాలకు.. ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలకు.. వాణిజ్యానికి .. వ్యవసాయ దిగుబడులకు నిలయం మెతుకు సీమ. కానీ ఈ ప్రాంతానికి రైలు మార్గం లేక అభివృద్ధి కుంటుపడిందన్నది మెజార్టీ ప్రజల భావన. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చి, తెలంగాణకే తల మాణికాలైన ఏడుపాయల దుర్గాభవాని, మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, ఇంజనీరింగ్, బీఎడ్, డీఎడ్, పీజీ కళాశాలలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు, విద్యార్థులు ఈ ప్రాంతాలకు తరలివస్తుంటారు. రైల్వే లైన్ ఉంటే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుందని అందరూ భావించారు. ఇందుకోసం 1980 ప్రాంతంలో రైల్వేలైన్ సాధన కోసం ఉద్యమం ఊపిరి పోసుకుంది. 2000 సంవత్సరంలో ఏర్పడిన రైల్వే సాధన సమితి కీలక పాత్ర పోషించింది. అనేక రకాల ఉద్యమాలతో పోరుబాట సలిపింది. రైల్వేసాధన సమితి అధ్యక్షులు సుభాష్ చంద్రగౌడ్ అధ్వర్యంలో చిరిగిన టెంట్లో, రంధ్రాలు పడ్డ జంకానాలో, చందాలు వేసుకొని సమకూర్చుకున్న కేవలం రూ .2 వేల వ్యయంతో 36 రోజుల నిరాహార దీక్షలు చేశారు. రాస్తారోకోలు, బంద్‌లు, ర్యాలీలు, ఢిల్లీ పర్యటనలు, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యంగా మెదక్ ఎంపీ విజయశాంతి అలుపెరుగని పోరాటం చేశారు. కేంద్ర రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి , రైల్వేశాఖ అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తన వంతు కృషి చేశారు. అలాగే మాజీ మంత్రులు బండారు దత్తాత్రేయ, నరేంద్ర, ఎమ్మెల్యే మైనంపల్లి హన ్మంత్రావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, న్యాయవాదులు, విద్యార్థి, యువజన, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులు, ఇతర మేధావులు, రైల్వే ఉద్యమానికి ఊపిరిలూదారు. రాష్ట్ర వాటాకు యస్ అన్న ‘వైఎస్’ అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో తన అంగీకారం తెలిపారు. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద కొత్త రైల్వేలైన్ల జాబితాలో అక్కన్నపేట- మెదక్ లైన్‌కు చోటు దక్కింది. 20ఛి11 బడ్జెట్లో ఆశించిన ఫలితం దక్కకపోయినప్పటికీ 2012 రైల్వే బడ్జెట్లో ఈ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు రైల్వే శాఖ నుండి రూ. కోటి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.కోటి, ఎంపీ విజయశాంతి తన కోటా నుంచి రూ.1 కోటి, 2013 బడ్జెట్లో రూ 1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రైల్వే లైన్ సర్వే, భూ వివరాల సేకరణ, రైల్వే స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇందుకు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితో పాటు, అటవీశాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసర మవుతుందని అధికారులు తేల్చారు. అయితే భూసేకరణ పూర్తయి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు టెండర్లు పిలవాల్సి ఉంది. రేపే నిజమైన సంక్రాంతి మూడు దశాబ్దాల మెదక్ ప్రజల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో రేపు నిజమైన సం క్రాంతి. రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులందరికీ నా కృతజ్ఞతలు. పనులు పూర్తి చేయాలని కోరుతున్నా. -విజయశాంతి, మెదక్ ఎంపీ త్వరగా పూర్తిచేయాలి రాష్ట్రంలో పెండిం గ్లో ఉన్న రైల్వే లైన్ నిధులను అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు బదిలీ చేయాలి. 2014 బడ్జెట్లో పూర్తి స్థాయి నిధులను విడుదల చేయాలి. రైల్వేలైన్ కోసం నిరుపేదలు చేసిన పోరాటమిది. పార్టీల కతీతంగా నాయకులూ సహకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిది. రైల్వే లైన్ మంజూరుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. -సుభాష్ చంద్రగౌడ్, రైల్వేసాధన సమితి అధ్యక్షులు