సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్/ అక్కన్నపేట : హుస్నాబాద్‌లో ఏకే–47 శబ్దం వినిపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గొర్రెల కాపరిగా ఉంటున్న వ్యక్తి ఏకే–47 గన్ పట్టుకొని తిరగడం, చిన్న గొడవ పెద్దది కావడంతో ఎదుటి వారిపై కాల్పులు జరిపిన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిమెంట్ ఇటుకల చేబదులుపై తలెత్తిన ఓ గొడవ పెద్దదై ఏకే–47 గన్‌తో కాల్పుల వరకు వచ్చింది. కోహెడకు చెందిన దేవుని సదానందం అక్కన్నపేటలోని తన మేనమామ గుంటి వెంకటయ్య ఇంటికి 2010లో వచ్చి పదేళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కన్నపేటకు చెందిన గుంటి గంగరాజు వెంకటయ్య వద్ద సిమెంట్ ఇటుకలను చేబదులు తీసుకున్నాడు. తర్వాత ఇటుకల విషయంలో సదానందం, గంగరాజు మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో కోపంగా ఉన్న సదానందం బుధవారం గంగరాజు తల్లి ఎల్లవ్వ వద్దకు తల్వార్‌తో వెళ్లి చంపుతానని బెదిరించాడు. అలాగే గురువారం రాత్రి సదానందం నల్లటి దుస్తులు, తలకు నల్లటి క్యాప్ ధరించి, భుజానికి ఏకే–47 తుపాకీ వేసుకొని అది పని చేస్తుందా లేదా అని ఇంటి ముందు నేలకేసి కాల్చాడు. ఈ శబ్దానికి ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై గంగరాజుకు చెప్పారు. దీంతో గంగరాజు, కుటుంబ సభ్యులు భయంతో ఇంటి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గంగరాజు ఇంటికి వచ్చిన సదానందం తుపాకితో కిటికీ నుంచి ఇంట్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు.
మాజీ మావోయిస్టుగా అనుమానం
సదానందానికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే స్వస్థలం కోహెడలో ఉన్న సమయంలోనే సదానందం పదేళ్లు కన్పించకుండా పోయాడని తెలుస్తోంది. తర్వాత తిరిగి వచ్చి అక్కన్నపేటలో ఉంటున్నాడు. అయితే అతను గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో మాయమైన ఏకే–47 ఇదేనా.?
గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తుపాకులను సిద్దిపేట జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పం పించారు. ఈ సందర్భంగా ఒక ఏకే–47, మరో ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ మాయమైంది. గురువారం అక్కన్నపేటలో ఏకే– 47 గన్ కాల్పుల ఉదాంతం బయటకు రావడంతో కనిపించకుండా పోయిన గన్ ఇదేనా అనే చర్చ జరుగుతోంది.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎస్సై పాపయ్యనాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలిం చారు. అక్కడ 3 తుపాకీ గుండ్లతో పాటు తుపాకీ బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదా నందం ఇంటిని సోదాచేశారు. ఇంటిలో తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదానందంకోసం గాలిస్తున్నారు. సిద్దిపేట ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత ఈ ఘటనపై ఆరా తీశారు. గంగ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం 3 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో కేసును ఛేదిస్తామని ఇన్‌చార్జి సీపీ ప్రకటన విడుదల చేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు సదానందం?
ఇదిలా ఉండగా పరారైన నిందితుడు దేవుని సదానందంను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సదానందం ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అదే సమయంలో గుర్తు తెలియని నంబర్ ద్వారా సదానందం ఇద్దరు భార్యల్లో ఒకరికి ఫోన్ చేసినట్లు తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు సదానందం చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నట్లు సమాచారం. అతడిని కోహెడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపిన పోలీసులు అక్కడి నుంచి వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. సదానందంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించలేదు.
అక్కన్నపేటలో ఏకే–47 కాల్పులు
Published Sat, Feb 8 2020 3:42 AM | Last Updated on Sat, Feb 8 2020 3:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment