
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలంటే..
ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వారితో పాటు జాతికి ఎనలేని సేవలు చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వారితో పాటు జాతికి ఎనలేని సేవలు చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అక్కినేని పార్థివదేహానికి గురువారం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్‌ఐ వడ్డిపల్లి రామారావు నేతృత్వంలో 24 మంది సిబ్బంది, పోలీసు బ్యాండు ఇందులో పాల్గొన్నాయి.
ప్రభుత్వం తరఫున ఓపెన్ టాప్ ట్రక్‌ను పూలతో అలంకరించి తెస్తారు. కత్తితో సహా తుపాకులు (.303 రైఫిల్) ధరించిన 15 మంది ఫైరింగ్ సిబ్బంది. పార్థివ దేహాన్ని మోసే బేరర్లు 10 మంది ఉంటారు.
సదరు వ్యక్తి జాతికి చేసిన సేవలు, ప్రభుత్వం నుంచి అందుకున్న అవార్డులను గౌరవిస్తూ ఇంటి వద్ద పార్థివదేహానికి ‘గార్డ్ ఆఫ్ హానర్’ పేరిట గౌరవ వందనం సమర్పిస్తారు.
తరవాత బేరర్లు శవపేటికను భుజాలపై ఎత్తుకుని లయబద్ధంగా నడుస్తూ అంతిమ సంస్కారాలు చేసే చోటికి తీసుకువెళతారు. దీన్ని ‘ధీరే చల్’ అంటారు.
పార్థివ దేహాన్ని చితిపై పెట్టి కట్టెలు పేరుస్తున్న సమయంలో మరోసారి ‘గార్డ్ ఆఫ్ హానర్’తో పాటు తుపాకుల్ని లయబద్ధంగా తిప్పుతూ ‘సలామీ శస్త్ర్’ వందనం చేస్తారు.
చితికి నిప్పుపెట్టే ముందు గాల్లోకి మూడు రౌండ్ల చొప్పున కాల్పులు జరిపి రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు.
అనంతరం తుపాకుల్ని తలకిందులుగా తిప్పి కుడి కాలుమీద పెట్టుకుంటారు. దీన్ని ‘శోక్ శస్త్ర్’గా పిలుస్తారు. సలామీ శస్త్ర్, శోక్ శస్త్ర్ సందర్భాల్లో శ్రద్ధాంజలి ఘటిస్తూ పోలీసు బ్యాండ్ వాయిస్తారు.
‘కార్వాయ్’గా పిలిచే ప్రధాన కార్యక్రమం 10 నిమిషాలుసాగుతుంది.