ఎల్.ఎన్.పేట: మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకు ఎక్సైజ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ కె.అప్పారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధాన రహదారికి కనీసం 100 అడుగుల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెబుతున్న ఇక్కడ అందుకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని మండల కేంద్రానికి చెందిన ఎం.ఆదెమ్మ, ఆర్.జ్యోతి, ఎం.భాగ్యలక్ష్మి, డి.శ్రీనివాసరావు, కె.సింహాచలంతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మద్యం దుకాణానికి సమీపంలోనే శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం ఉందని, ఎదురుగా తహసీల్దారు, ఎంపీడీఓ, ఐకేపీ కార్యాలయాలకు వెళ్లేందుకు రోడ్డు ఉందన్నారు. వైన్ షాపు ఉన్నచోటే రోడ్డుపై ఆటోలు నిలుపుతారని దీని వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ మేరకు మరోచోట దుకాణం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఫిర్యాదును జిల్లా అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
మద్యం షాపు మార్చాలని వినతి
Published Wed, Jul 12 2017 3:31 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement