ఏలూరు టౌన్: జిల్లాలోని మద్యం వ్యాపారులు పోరుబాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో దశలవారీగా ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా వైన్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. షాపులను మూసివేయాలని నిర్ణయించినా ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. స్పందించని పక్షంలో ఏప్రిల్ నెలాఖరు నుంచి రాష్ట్రంలోని 25 మద్యం డిపోల నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు.
ఏడాది నుంచీ ఆందోళన
గత ఏడాది లైసెన్స్ ఫీజు కట్టించుకున్న మూడు నెలల తర్వాత మద్యం అమ్మకాలపై కమీషన్ తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి మద్యం వ్యాపారులు కమీషన్ పెంపు కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు హైకోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. ఈ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కమీషన్ తగ్గించడంతో వారికి వచ్చే ఆదాయం లైసెన్స్ ఫీజులు ఇతర ఫీజుల చెల్లింపుకే సరిపోతోంది. అద్దెలు, సిబ్బంది వేతనాలకు కూడా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకునే అవకాశం ఉన్నా ఎక్కువ చోట్ల ఎమ్మార్పీకే అమ్మాలని అ«ధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెల్ట్‌షాపులపై దాడులతో అసలు ఆదాయం లేకుండా పోయిందని భావిస్తున్నారు. దీంతో తమకు అమ్మకాలపై ఇచ్చే కమిషన్‌ను 7.5 శాతం నుంచీ 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 22 శాతం వరకూ కమీషన్ వచ్చేది.
దీనిలో ఒక శాతం ఆదాయపు పన్ను మినహాయించినా మిగిలిన మొత్తం వల్ల మద్యం వ్యాపారులు లాభాల బాటలో ఉండేవారు. ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాటరీ విధానంలో మద్యం షాపులు కేటా యించటంతోపాటు 21 శాతం కమీషన్ వచ్చేది. ఇప్పుడు అది సగానికన్నా తక్కువకు పడిపోయింది. జిల్లా మొత్తంలో 474 మద్యం షాపులకు సంబం ధించి రూ.126.24కోట్లు, 38 బార్లకు రూ.7.23 కోట్లు లైసెన్సు ఫీజుగా మద్యం వ్యాపారులు చెల్లించారు. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదనే హైకోర్టు ఉత్తర్వులతో షాపులు మా ర్పుకు అయా షాపుల యాజమాన్యాలకు రూ.లక్షల్లో అదనపు ఖర్చులు అయ్యాయి. మద్యం దుకాణాల నిర్వహణకు ఖర్చులు భారీగా అవుతుంటే, కమీషన్‌లోనూ కోతలు విధించటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాల వల్లే నష్టం
ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌డీలర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక దుకాణాలు మూసుకోవాల్సిందే. ఇప్పటికే మద్యం వ్యాపారులు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
– ఉప్పులూరి శేషగిరిరావు, వైన్స్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
కొనుగోలు నిలిపేయాల్సి ఉంటుంది
ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్టంలోని మద్యం డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయడం ఆపివేసే దిశగా చర్యలు తీసుకుంటాం. త్వరలో రాష్ట్రస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని దశలవారీగా ముందుకు తీసుకువెళ్తాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే ఏడాదికి రూ 1800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.
– రాయల సుబ్బారావు
వైన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment