
మహాసంకల్పం..సర్వం సిద్ధం
సాక్షి, గుంటూరు : తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ‘మహాసంకల్పం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సభను నిర్వహించనుంది. ఈ సభకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన ప్రాంతంలోనే ఈ సభ నిర్వహించనుండటం విశేషం. మహా సంకల్పం సభను సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి మించి అధిక ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
దాదాపు 40 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాంగణాన్ని నిర్మించారు. సుమారు 2 లక్షల మంది కూర్చొనేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యేందుకు వీలుగా 76/58 సైజులో 250 మంది సామర్థ్యంతో భారీ వేదిక నిర్మించారు. ఎక్కడికక్కడ మెష్ బారికేడ్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌లు..
మంత్రులకు ఏఏ పాస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ1, ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏ2 పాస్‌లను ఇస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాయకులకు ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌ల చొప్పున అందించారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలిపేలా ముందుగానే వారికి కేటాయించిన సీట్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. సభాస్థలిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం...
సభ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుండటంతో ప్రాంగణం మొత్తం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకొనేలా 15 పీటీజడ్ కెమెరాలతో పాటు 35 ఫిక్స్‌డ్ కెమెరాలను అమర్చి రెండు కిలోమీటర్లు పరిధిలో విజువల్స్ రికార్డు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సభ ముగిసే వరకు సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.
ప్రత్యేక పార్కింగ్ స్థలాలు...
సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను టోల్‌ఫ్లాజా వద్ద, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను డాంగే నగర్, ఐజేఎంల వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలం నుంచి సభావేదిక వద్దకు ప్రజలను చేరవేసేందుకు షటిల్ సర్వీస్‌పేరుతో 40 తుఫాన్ వాహనాలను సమకూరుస్తున్నారు. పోలీసు, రెవె న్యూ, ఇతర అధికారుల సమన్వయం కోసం 250 వాకీటాకీలను అందజేశారు. ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సభ ముగిసిన తరువాత తిరిగి వెళ్లే సమయంలో భోజన ప్యాకెట్లను అందజేయనున్నారు. 15 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు...
సభాస్థలిలో రిమోట్‌తో బాణాసంచా పేల్చేలా చర్యలు తీసుకుంటున్నారు. సభకు హాజరయ్యే ప్రజలను అలరించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను తెలిపేలా బుర్ర కథలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను వారం రోజులుగా అడిషనల్ డీజీ సురేంద్రబాబు,గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, నగరపాలక సంస్థ కమిషనర్ కె. కన్నబాబు, రేంజి ఐజీ ఎన్. సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణనాయక్‌లు పర్యవేక్షిస్తున్నారు.