అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్ రోడ్స్ :
తమ ప్రభుత్వం జిల్లాను పట్టించుకోవడం లేదనేదాంట్లో నిజంలేదని, అన్ని విధాలా జిల్లాను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు శుక్రవారం నగరంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సెయిల్ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడపలో డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామమన్నారు. ముంపువాసులకు కేవలం రూ. 13 కోట్లు పరిహారంగా చెల్లిస్తే గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపవచ్చన్నారు. కానీ, గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిం చిందని తెలిపారు. అలాగే పీబీసీ, మైలవరానికి రావాల్సిన నీటి విడుదల కోసం కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు లభించే 45 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు. రెండు, మూడు నెలల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో పార్టీలకతీతంగా తాను పనిచేస్తానని, మిగిలిన సమయంలో సాధారణ టీడీపీ కార్యకర్తగా వ్యవహారిస్తానన్నారు. కొన్ని కులాలను విస్మరిస్తున్నామన్న వాదన కూడా పసలేనిదని ఆయన కొట్టిపారేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, పీరయ్య, జిలానీబాషా, మహిళా నాయకురాలు కుసుమకుమారి పాల్గొన్నారు.