సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చోట కాంగ్రెస్ నుంచి వచ్చే వారిని చేర్చుకుంటున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ చెడ్డోళ్లు కాదంటూ కితాబిచ్చారు. మంచివారినే టీడీపీలో చేర్చుకుంటున్నామని అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ వ్యవహారాలపై ఎవరూ మీడియాకు ఎక్కవద్దని హెచ్చరించారు. ఎవరినైనా పార్టీలో చేర్చుకునే ముందు స్థానిక నేతలందరితో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి కమిటీ వేస్తానని తాను నేతలతో పాటు మీడియాకూ చెప్పానని, ఈ విషయంలో డప్పు కొట్టుకుంటూ ఊరూరా తిరగాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోరుునా తాను భయపడేది లేదన్నారు.
తెలంగాణ వచ్చేంత వరకూ టీడీపీలో కొనసాగిన నేతలు, ఎమ్మెల్యేలు కేవలం స్వార్థంతోనే ఇప్పుడు బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ ఎర్రబెల్లి దయాకరరావు రాసిన లేఖ తనకు అందలేదని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ప్రణాళికను తయారు చేసేందుకు యనమల రామకృష్ణుడు నేతృత్వంలో పయ్యావుల కేశవ్, రావులపాటి సీతారామారావు తదితరులతో ఒక కమిటీ వేశానని చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందు పురపాలక ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంక్షోభమేనని విమర్శించారు. పురపాలక ఎన్నికలకు ప్రత్యేకంగా ప్రణాళికను విడుదల చేస్తామన్నారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ తరహాలో ఇక్కడ అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తినుబండారాలు అందిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కోరేది.
1. కాంగ్రెస్ వారిని చేర్చుకోవడాన్ని కోడెల శివప్రసాదరావు, అయ్యన్నపాత్రుడు లాంటి మీ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు కదా?
2. పార్టీ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుని వారికే టికెట్లు ఇచ్చి పార్టీని నడిపించుకోవలసిన దుస్థితి రావడానికి కారణమెవరంటారు?
3. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వారే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్‌ను గద్దెదింపారు. అలాంటిది మేము టీడీపీలో చేరితే తప్పేమిటని కాంగ్రెస్ నేతలంటున్నారు. దీనిపై మీరేమంటారు?
బాలయోగికి నివాళులు: లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి 12వ వర్ధంతి సభను సోమవారం ఎన్‌టీఆర్ భవన్‌లో నిర్వహించారు. బాలయోగి విలువలతో కూడిన రాజకీయాల కోసం పనిచేశారని చంద్రబాబు నివాళులర్పించారు.
కాంగ్రెస్సోళ్లందరూ చెడ్డోళ్లు కాదు: చంద్రబాబు
Published Tue, Mar 4 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement